కీలక వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ
– పావుశాతం కోత విధిస్తూ కమిటీ నిర్ణయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జనంసాక్షి) : దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది. ఆర్బీఐ చైర్మన్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన సవిూక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. ఈ మేరకు కీలక వడ్డీరేట్లలో పావుశాతం కోత విధిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ తగ్గింపు కారణంగా రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. గృహ రుణాలపై కూడా వడ్డీరేట్లు తగ్గనున్నాయి. ద్రవ్యోల్బణాన్ని 4శాతంగా ఉంచే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మానిటరీ పాలసీ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ)లో వడ్డీరేట్ల తగ్గింపుపై నలుగురు సభ్యులు సానుకూలంగా స్పందించగా.. ఇద్దరు వ్యతిరేకించారని శక్తి కాంత దాస్ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచి వృద్ధిరేటును మెరుగుపరచాలన్న ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయం ఉంది. వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ చేసిన ప్రకటనతో దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజిటివ్ స్పందిస్తున్నాయి. ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ షేర్లు భారీ లాభపడుతున్నాయి.
ఆర్‌బీఐ సవిూక్షలో కీలక నిర్ణయాలివే..
రెపో రేటు (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణంపై వడ్డీ రేటు)ను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు.. ఇప్పుడు 6.25 శాతానికి తగ్గింది. ఇక రివర్స్ రెపో రేటు (ఆర్బీఐకి బ్యాంకులు ఇచ్చే రుణంపై వడ్డీ)ను 6శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు(బ్యాంకు రేటు)ను 6.5 శాతానికి తగ్గించారు. మార్చి తైమ్రాసికంలో ద్రవ్యల్బోణం 2.8శాతంగా ఉండొచ్చని కమిటీ అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 3.2-3.4 శాతంగా, ఆ తర్వాత వచ్చే మూడు నెలలు ద్రవ్యోల్బణం 3.9 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా వచ్చే అశకాశముందని ఆర్‌బీఐ అంచనా వేసింది.