కుదేలవుతున్న దేశ ఆర్థికరంగం
వెన్నాడుతున్న నోట్ల రద్దు దుష్ఫలితాలు
న్యూఢిల్లీ,ఆగస్ట్31 ( జనంసాక్షి ) : పెద్దనోట్ల రద్దు వల్ల దుష్ఫలితాలే తప్ప మంచి ఫలాలు అందలేదన్నది తేలిపోయింది. గత రెండేళ్లుగా జరుగుతన్న పరిణామాలు ఆర్థికరంగాన్ని పురోగమించేలా చేయలేకపోయాయి. దేశం ఆర్థికంగా బలోపేతం అవుతున్నదన్న ప్రచారం వెనక ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప మరేవిూ కనిపించడం లేదు. నోట్లరద్దు వ్యవహారం ఇప్పుడు మరోమలుపు తిరిగింది. దాదాపు బ్లాక్ మనీ అంటూ ఏదీ లేదని మొత్తం రద్దయిన నోట్లన్నీ ఖజానాకు చేరాయని ఆర్‌బిఐ గతంలోనే ప్రకటించింది. ఈ దశలో రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోతోంది. అమెరికా డాలరుకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ పడిపోయింది. ఇలా ప్రతి నిర్ణయం ప్రజలకు శరాఘాతంగా మారుతోంది. ప్రధానంగా నిరుద్యోగం వంటి ఎన్నో సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. నోట్ల రద్దు అనేది ప్రజలపై జరిగిన ఉద్దేశపూర్వక దాడిగా ఇప్పటికే ఆర్థికవేత్తలు,విపక్షాలు పెద్దెత్తున విమర్శలకు దిగారు. ఎవరు అవునన్నా కాదన్నా పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ సర్వ నాశనమయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. గ్రావిూణ ప్రజల జీవితాలు ఛిద్రం అయ్యాయి. నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాద నిధులు ఇత్యాది రోగాలన్నింటికీ నోట్ల రద్దును రోగనివారిణిగా ప్రకటించినా సత్ఫలితాలు ఇవ్వలేదు. రెండువేల నోటు స్థానంలో వేయినోట్లు ఎందుకు తేవడంలేదన్న దానికి నేటికీ సమాధానం రావడం లేదు. రెండేళ్ళక్రితం దేశం ఎదుర్కొంటున్న సమస్త అరిష్ఠాలను ఏకరువుపెడుతూ ఏకైక పరిష్కారంగా చెలామణీలో ఉన్న పెద్దనోట్లను ఉన్నఫళంగా రద్దుచేయడమే అని ప్రవచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న నకిలీ నోట్ల ఉనికి దొరకలేదు. చిన్న వ్యాపారాలు చితికిపోయాయి. పెటిఎం, రిలయన్స్ లాంటి సంస్థలు బాగుపడ్డాయి. ప్రజలను బలవంతంగా అనేక యాప్‌ల వైపు వెళ్లేలా చేశారు. ఈ నిర్ణయం దుష్పభ్రావాలను మాత్రం దేశం ఇంకా అనుభవిస్తూ తేరుకోలేని దుస్థితిలోకి జారిపోయిందన్నది వాస్తవం. ఆర్థిక ప్రగతి పరుగులు పెడుతోందని, ఇకపై ఆర్థికరంగం దూకుడును తట్టుకోవడం ఎవరి తరమూ కాదన్నారు. రెండేళ్లుగా ప్రజలు దాని నుంచి కోలుకోవడం లేదు. బ్యాంకింగ్ రంగం నిర్వీర్యం అయ్యింది. దినసరి కూలీల బతుకులు బజారుపాల్జేసి, వేలాది చిన్న తరహా పరిశ్రమలను మూసివేయించిన ఘన నిర్ణయంగా చరిత్రలో నిలిచిపోయింది. రద్దు తరవాత డిజిటల్ వైపు పరుగెత్తాలన్న ఒత్తిడి వచ్చినా దేశంలో నగదు చెలామణీ నలభైశాతం హెచ్చిందని కూడా ఇదే ఆర్బీఐ తేల్చేసింది. ఆర్థిక ప్రగతిని దెబ్బతీసిన పెద్దనోట్ల నిర్ణయం ఒక ఘోర చారిత్రక తప్పిదమని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. పడిపతోతున్న రూపాయిని నిలబెట్టాలి. ఆర్థిక జవసత్వాలు కలిగే నిర్ణయాలు తీసుకోవాలి.