కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌..

– 25మంది మృతి

– తామే హెలికాప్టర్‌ను పేల్చామని ప్రకటించుకున్న తాలిబన్లు

అబుదాబి, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలడంతో 25మంది మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 9.10 నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అనంతరం ప్రమాదం గురించి పశ్చిమ ఫరాహ్‌ ప్రొవిన్స్‌ గవర్నర్‌ నసీర్‌ మెహ్రీ ఓ ప్రకటన చేశారు. హెలికాప్టర్‌ కుప్పకూలిందని.. ఈ ఘటనలో 25మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఉదయం రెండు హెలికాప్టర్లు ఫరాహ్‌ ప్రొవిన్స్‌ నుంచి హెరాత్‌ ప్రొవిన్స్‌కు బయల్దేరాయి. కొద్దిసేపటికే ఆ రెండు హెలికాప్టర్లలో ఒకదానికి రాడార్‌ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. కొండ ప్రాంతమైన అనార్‌ దారా జిల్లా నుంచి హెరాత్‌ ప్రావిన్స్‌కు బయల్దేరిన కొద్ది సేపటికే హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ పర్వతాన్ని ఢీకొన్నట్లు దీంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఫరా ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ చీఫ్‌ ఫరీద్‌ భక్తావర్‌, 207 జాఫర్‌ మిలిటరీ కార్ప్స్‌ డిప్యూటీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ నెమతుల్లా ఖలీల్‌ ఉన్నారు. అలాగే ఫరా ప్రావిన్స్‌ కౌన్సిల్‌ సభ్యులతో పాటూ జాఫర్‌ మిలటరీ కార్ప్స్‌ చెందిన సీనియర్‌ అధికారులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై తాలిబన్లు స్పందించారు. తామే హెలికాప్టర్‌ను పేల్చినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు.