కుప్పకూలిన జాగ్వర్‌ విమానం

పైలట్‌ క్షేమం

లక్నో,జనవరి28(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ ఫైటర్‌ ప్లేన్‌ కూలింది. కుషీనగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ యుద్ధ విమానాన్ని నడుపుతున్న పైలట్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. గోరఖ్‌పూర్‌ వాయుసేన స్టేషన్‌ నుంచి జెట్‌ విమానం ఎగిరింది. అయితే ప్రమాద సమయంలో పైలట్‌ ప్యారచూట్‌ సహాయంతో కిందకు దిగాడు. ఘటన జరిగిన

ప్రాంతానికి జిల్లా అధికారులు, పోలీసులు చేరుకున్నారు. గోరఖ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన విమానం హెతింపిర్‌ ప్రాంతం వద్ద కూలిపోయిందని గుర్తించారు. విమాన ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా గత ఏడాది జూన్‌లో గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో జాగ్వర్‌ యుద్ధ విమానం కూలిన ఘటనలో విమానం నడుపుతున్న సీనియర్‌ అధికారి మరణించారు. బరేజా గ్రామంలో విమానం కుప్పకూలడంతో పైలట్‌గా ఉన్న వాయుసేన పతక గ్రహీత, జామ్‌నగర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఎయిర్‌ఆఫీసర్‌ కమాండింగ్‌ సంజయ్‌ చౌహాన్‌ మరణించారు.