కుమారుడిని చంపిన కేసులో తండ్రి అరెస్టు
ధర్మసాగర్, జనంసాక్షి:కుమారుడ్ని చంపిన కేసులో నిందితుడైన తండిని బుదవారం అరెస్టు చేశామని ధర్మసాగర్ సీఐ పి.శ్రీనివాస్ తెలిపారు. సీఐతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి కి చెందిన జోగు వెంకటయ్య (57) కు ముగ్గురు కుమారులున్నారు. పెద్దకుమారుడు జోగు మహేందర్ (28) తాగుడుకు బానిసై చిల్లర దొంగతనాలు చేసేవాడు. ధర్మసాగర్, కాజీపేట, హన్మకొండ ప్రాంతలలో సైకిళ్లు, ఇంట్లో సామాగ్రి చోరీ చేసేవాడు. డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులు, సోదరులతో నిత్యం ఘర్షణ పడేవాడు. దీంతో ఇద్దరు సోదరులు గ్రామం విడిచి బతుకుదెరువు కోసం వెళ్లారు. ఇంట్లోనే ఉంటున్న తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాలంటూ, పెళ్లిచేయాలంటూ తరచు గొడవ పడేవాడు ,మూడు నెలల క్రితం తల్లిని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందింది. అప్పటి నుంచి గ్రామంలో ఉండకుండా రాత్రివేళల్లో వస్తూ తండ్రి వెంకటయ్యతో గొడవపడి ఇంట్లో డబ్బులు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో ఏప్రీల్ 14న మద్యం సేవించి వచ్చిన మహేందర్ తండ్రితో గొడవ పడగా స్ధానికులు సర్దిచెప్పరు. మళ్లీ అర్ధరాత్రి వచ్చిన మహేందర్ తన తండ్రిపై దాడికి యత్నించి హన్మకొండకు రమ్మంటూ లాక్కెళ్లాడు. కొద్ది దూరం వెళ్లాక బండరాళ్లు అడ్డు తగిలి మహేందర్ కింద పడిపోయాడు. ఎప్పటికైనా మహేందర్‌తో ప్రాణభయం ఉందని భావించిన వెంకటయ్య పక్కనే ఉన్న తుమ్మ కర్రతో మహేందర్ తలపై విచక్షణరహితంగా కొట్టడంతో మృతి చెందాడు. తెల్లవారుజామున తన కొడుకును ఎవరోకొట్టి చంపారని గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశాడు. గ్రామ వీఆర్‌ఓ కుమారస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వెంకటయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా మహేందర్‌ను తనే కొట్టి చంనినట్టు అంగీకరించాడు. నిందుతుడిపై కేసు నమోదు చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.