కుల వివక్షను రూపుమాపాలి

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ
పూణె, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : దేశంలో కుల వివక్షను రూపుమాపాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు.  పుణెలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఎవరైనా కులం గురించి మాట్లాడితే వారిని కొడతానని హెచ్చరించానని.. అందుకే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నాగ్‌పూర్‌ ప్రాంతంలో ఎవరూ కులం గురించి మాట్లాడరని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తనకు తెలియదన్నారు. కుల, వర్గ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజల మధ్య వ్యత్యాసాలను రూపుమాపడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. పేదలకు సాయం చేయాలని.. అది దేవుడికి సేవ చేయడంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నెరవేర్చలేని హావిూలు ఇవ్వడం తగదని, అలాంటి వారిని ప్రజలు తిరస్కరిస్తారని చేసిన వ్యాఖ్యలు సంచలనం అయిన విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతలను ఉద్దేశించే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.