కూతురు జన్మ దినోత్సవాన తల్లితండ్రులు అవయవ దానం

రామకృష్ణాపూర్ (జనంసాక్షి): రామకృష్ణాపూర్ వాస్తవ్యుడు కలగూర నరేందర్ ప్రియాంకల కూతురు ఖుషి మొదటి జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ ఆర్కే సి ఓ ఏ క్లబ్ లో మానవతా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దంపతులు నరేందర్, ప్రియాంకలు నేత్ర అవయవ దానాలు చేయడానికి అంగీకరించినారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ రాజా రమేష్, ఎస్ఆర్పి 3, 3ఏ గని మేనేజర్ సంతోష్, ఆర్కెపి సిఎస్పి డివైజియం బాలాజీ భగవత్ ఝా, డి వై ఎస్ ఈ . చంద్ర మొగిలి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పొన్నాల సాగర్ పాల్గొని దంపతులను అభినందించి, శాలువాతో సన్మానించి ,ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజ రమేష్ బాబు మాట్లాడుతూ….. తన కూతురు మొదటి పుట్టినరోజు సందర్భంగా వారిద్దరు కళ్ళు దానం చేయడం నిజంగా ఇది వారి కూతురుపై ఉన్న ప్రేమకి, సమాజంపై ఉన్న బాధ్యతకి ప్రతిరూపం అన్నారు. వారిద్దరు వారి కళ్ళు దానం చేసి అంధకారంలో ఉన్న ఒక నలుగురిని ఈ ప్రపంచాన్ని చూసే గొప్ప అదృష్టాన్నిబీవారికి అందించినందుకు అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పోన్నాల సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం అన్నారు.