కేంద్ర ప్రభుత్వం.. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తోంది

 

– మోదీ విధానాలతో దేశ ప్రతిష్ట మసకబారుతుంది

– నిరుద్యోగ సమస్య నివారణలో విఫమయ్యారు

– నల్లధనం వివరాలు ఎందుకు చెప్పట్లేదు?

– రఫేల్‌ ఒప్పందం విషయంలో జేపీసీ వేయాల్సిందే

– ఈ ఒప్పందంపై సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం తప్పుడు వివరాలిచ్చింది

– రైతుల ఆదాయాన్ని రెట్టింపు హావిూ ఏమైంది?

– ఎన్నికలు సమయంలో ప్రజలను మభ్యపెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారు

– లోక్‌సభలో కేంద్రంపై నిప్పులుచెరిగిన మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : రాజ్యాంగబద్ధ వ్యవవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, భాజపాకు దేశంలోని వ్యవస్థల పట్ల గౌరవం లేదని, దేశంలోని పేద ప్రజలు తమ గళాన్ని విప్పకుండా అణచివేసే ధోరణితో వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ కేంద్ర విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనది ప్రజాస్వామ్య, లౌకికవాద, గణతంత్ర దేశమని, ఎన్డీఏ ప్రభుత్వం వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెనుకబడిన తరగతుల వారి రిజర్వేషన్లను కూడా తొలగించాలని భావిస్తోందన్నారు. న్యాయవ్యవస్థ, ఆర్‌బీఐ, నీతి ఆయోగ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ, సీబీఐ, ఈడీ, సీవీసీ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుండడంతోదని, దాన్ని కప్పిపుచ్చేలా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం ఇచ్చారన్నారు. ఈ ఐదేళ్లలో ప్రధాని మోదీ పార్లమెంటులో, బయట ఎటువంటి మాటలు చెప్పారో, ఆ విషయాలనే రాష్ట్రపతి చెప్పారన్నారు. ఈ అరవై ఏళ్లలో కాంగ్రెస్‌ దేశానికి ఏం చేసిందని భాజపా ప్రశ్నిస్తోందని, దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్షరాస్యతను పెంచిందని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిందని, హరిత విప్లవానికి కారణమైందన్నారు. శిశుమరణాల సంఖ్యను తగ్గించింని, మా ప్రభుత్వ హయాంలో రోడ్లు, రైల్వే లైన్ల నిర్మాణాలను విస్తృతం చేశామని ఖార్గే పేర్కొన్నారు. 1947లో దేశంలో కేవలం 500 కళాశాలు మాత్రమే ఉండేవని, 2014 నాటికి దేశంలో 36,000 కళాశాలలు నెలకొన్నాయన్నారు. ఈ 60 ఏళ్లు మేము దేశాన్ని కాపాడామని, నీరు, ఆహారం, విద్య వంటి అన్ని సదుపాయాలను కల్పించామని ఖార్గే అన్నారు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యధిక వృద్ధిరేటు కొనసాగేలా చేసిందని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం జీడీపీ వృద్ధి చెందుతోందని చెప్పుకుంటోందని, మరి దేశంలో నిరుద్యోగ సమస్య ఇంతగా ఎందుకు ఉంది? పెద్దనోట్ల రద్దు చేసే సమయంలో ప్రభుత్వం అనేక హావిూలు గుప్పించింది. దేశానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పింది. కానీ, నోట్ల రద్దు వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధనవంతులకు మాత్రం ఎటువంటి సమస్యలు ఎదురుకాలేదు. నోట్ల రద్దు వ్యవస్థీకృత, చట్టబద్ధ దోపిడీ అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా తెలిపారు. అరవింద్‌ సుబ్రహ్మణ్యం, అమర్త్యసేన్‌ వంటి ఆర్థికవేత్తలు కూడా పెద్దనోట్ల రద్దుని విమర్శించారన్నారు. రద్దయిన నోట్లలో 99.9 శాతం వెనక్కువచ్చాయని ఆర్‌బీఐ చెబుతోందని, మరి నల్లధనం గురించి వివరాలు చెప్పట్లేదేంటీ?’ అని ఖర్గే నిలదీశారు. దేశంలో నిరుద్యోగ రేటు 6.1 శాతంగా ఉందని, ఈ విషయాన్నిప్రభుత్వం దాచి పెట్టాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అత్యధికంగా ఉందని, రైల్వేతో పాటు పలు సంస్థలో ఉద్యోగాల భర్తీ చేయట్లేదన్నారు. రఫేల్‌ ఒప్పందం విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని, ఈ ఒప్పందంపై సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం తప్పుడు వివరాలు అందించింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ హావిూ ఇచ్చారు. కానీ నెరవేర్చట్లేదు. ధనవంతుల రుణాలను మాత్రం మాఫీ చేస్తున్నారు. ఎన్నికలు సవిూపిస్తున్న సమయంలో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఖర్గే విమర్శించారు. దేశ ప్రజలు మోదీ అసంబద్ద విధానాలను గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్దిచెప్పేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. దీనిని పోగొట్టేందుకు మోడీ ఎన్నికల సమయంలో హావిూలు గుప్పిస్తున్నారని విమర్శించారు.