కేంద్ర సర్కార్‌ ఏర్పాటులోతృణమూల్‌దే కీలకపాత్ర

– పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):కేంద్ర సర్కార్‌ ఏర్పాటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల తర్వాత పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశాలు ఉన్నాయని దీదీ తెలిపారు. మంగళవారం రాయిగంజ్‌లో జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. మోదీని సాగనంపేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ పొత్తులు కుదిరాయని, మోదీని గద్దెదింపిన తర్వాత, నవ భారత నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి బంగ్లా అన్న పేరు పెట్టేందుకు బీజేపీ నిరాకరించిందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏకపక్ష తీర్మానం జరిగినా, కేంద్రం మాత్రం రాష్ట్ర పేరును మార్చేందుకు నిరాకరిస్తోందని దీదీ అన్నారు. బీజేపీ ఎదగడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. బీజేపీకి ధీటుగా కాంగ్రెస్‌ పోరాటం చేయలేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీ పుంజుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ఆ పార్టీ ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
మోడీ ఓ ఫాసిస్ట్‌..హత్యా రాజకీయాలు ఆయన నైజం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ. అల్లర్లు, హత్యలతోనే రాజకీయాల్లోకి మోదీ వచ్చారు. ఫాసిస్టులకు ఆయన కింగ్‌. హిట్లర్‌ ఒకవేళ బతికి ఉండి ఉంటే.. మోదీ చేసిన పనులు చూసి ఆత్మహత్య చేసుకునేవాడు అని మమతా ఘాటుగా స్పందించారు. ప్రతి కేంద్ర సంస్థను వాడుకుంటూ, ప్రతిపక్షం గొంతు నొక్కడానికి మోదీ సర్కార్‌ చేయని ప్రయత్నం లేదని మమతా విమర్శించారు. మోదీకి సొంత డబ్బా ఎక్కువ. తనపైనే ఆయన సినిమా తీసుకున్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి.. ఆయన వల్ల అల్లర్లు జరిగాయి. గుజరాత్‌ జరిగిన ఘటనను ఎవరూ మరచిపోరు అని మమతా అన్నారు. ఇక నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ)పై స్పందిస్తూ.. వాళ్లు మిమ్మల్ని తరిమి కొడతారు. వెస్ట్‌ బెంగాల్‌లోనూ ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తామన్నారు. వాళ్లు చేసి చూడనీ.. ఏమవుతుందో వాళ్లకు తెలుస్తుంది అని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్‌ విఫలమవడం వల్లే బీజేపీ ఇంతలా చెలరేగిపోతున్నదని మమతా విమర్శించారు. రాహుల్‌ అధికారంలోకి రావాలనుకుంటే.. ఇతర పార్టీల మద్దతు తీసుకోక తప్పదని అన్నారు.