కేటీఆర్‌వి కారుకూతలు

` ఆయనకు మతిభ్రమించింది
` అందుకే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు
` మండిపడ్డ మంత్రి పొంగులేటి
ఖమ్మం(జనంసాక్షి):పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. కేటీఆర్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న తమకు అతడి ప్రతి మాటకు స్పందిచాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి మరోసారి ఫైర్‌ అయ్యారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ లాగా తొండాట ఆడాలనే ఉద్దేశ్యం ఇందిరమ్మ ప్రభుత్వానికి లేదని అన్నారు. అమృత్‌ టెండర్లలో ఒక్క రూపాయి వర్క్‌ రాఘవ కన్ట్సక్షన్స్ర్‌కు లేవని.. ఉంటే నిరూపించాలని కేటీఆర్‌కు ఛాలెంజ్‌ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తోన్న కేటీఆర్‌కి సిగ్గుండాలని ఘాటు విమర్శలు చేశారు. కేబినెట్‌ మంత్రికి ఎలాంటి పవర్స్‌ ఉంటాయో తెలియని కేటీఆర్‌ పదేళ్లు ఎలా పని చేసాడో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టమని.. చిన్న దొరనైనా, పెద్దదొరనైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. మేఘా కృష్ణా రెడ్డి కంపెనీ లేదా ఇంకొక కంపెనీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెడ్‌ కార్పెట్‌ వేశారో.. తెలంగాణ , దేశ వ్యాప్తంగా ప్రజలంతా గమనించారని.. ఆ వ్యాపారాలు చేసే సంస్ధలు గమనించాయన్నారు. ఏ కంపెనీనైనా బ్లాక్‌ లిస్టులో పెట్టేందుకు అర్హులైతే ప్రభుత్వం తప్పకుండా బ్లాక్‌ లిస్టులో పెడుతుందని స్పష్టం చేశారు. ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫీట్‌ అనే క్లాజ్‌ తెలుసు, చట్టం ఏంటో తెలుసు.. అంత అమాయకంగా ఇక్కడ ఎవ్వరు లేరని.. తనతో సహా చట్టం విషయంలో ఎవరికి చుట్టాలు ఉండరని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎప్పుడు పెట్టని విధంగా.. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు కోసం రూ.72 వేల కోట్ల బ్టడెట్‌ పెట్టామని గుర్తు చేశారు. గత పదేళ్లు రాచరిక పరిపాలన చేసిన పెద్దలు.. అది పీకుతాం, ఇది పీకుతాం ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటు ప్రగల్భాలు పలుకుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కక్ష్య పూరిత రాజకీయాలు చేయమని చెప్పారు. రాష్ట్రంలో ఏ రైతుకు ఇబ్బంది లేకుండా పంట మొత్తం కోనుగోలు చేయడంలో ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయబోదని అన్నారు. గత పదేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్‌ చేయలేనిది ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు మంచి సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.