కేరళలో వర్ష బీభత్సం
ఐదు జిల్లాల్లో బారీగా వర్షాలు నమోదు
తిరువనంతపురం,అక్టోబర్16(జనంసాక్షి ): కేరళలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నది. పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావం పథనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నది. ఆ ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
అదేవిధంగా భారీ వర్షసూచన ఉన్న తిరువనంతపురం, కొల్లామ్, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ప్రస్తుతం దక్షిణ, మధ్య ప్రాంత జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా ఉన్నాయని, సాయంత్రానికి ఉత్తరాది జిల్లాల్లో కూడా తీవ్రతరం కావొచ్చని ఆయన తెలిపారు.