కేరళ మరింత అతలాకుతలం

వదలని భారీ వర్షాలతో తీవ్ర పరిణామాలు
14 జిల్లాల్లో అత్యంత ప్రమాదకరస్థాయి హెచ్చరికలు
– పాల్కడ్‌లో కొండచరియలు విరిగి పడటంతో ఏడుగురు మృతి
– 87కు చేరిన మృతుల సంఖ్య
– మెట్రో, రైళ్ల సేవలు రద్దుచేసిన ప్రభుత్వం
– సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది
– వరద ఉధృతిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌  ఆరా
– భారీ వర్షాలతో పోటెత్తిన పంబా నది
– అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారుల సూచన
– శబరిమలకు యాత్రికులు రావొద్దని అధికారులు విజ్ఞప్తి
– వరద నీటిలోనే కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం
– కేరళ సీఎంకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌
– వరద పరిస్థితిపై ఆరాతీసిన ప్రధాని
తిరువనంతపురం,ఆగస్టు16(జ‌నం సాక్షి): గత వారం రోజులులగా విపరీతమైన వర్షాలు కురుస్తుండండంతో కేరళలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది.. భారీ వర్షాలతో రాష్ట్రంలో 14 జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయి హెచ్చరికలను ప్రభుత్వం జారీచేసింది.. విరామంలేకుండా కురుస్తున్న వర్షాలతో, ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరద నీటితో కేరళలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. పలు నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భారీ వర్షాలకు ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 87కు చేరింది. పాలక్కడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఏడుమంది మృత్యువాతపడ్డారు. వాతావరణశాఖ అధికారులు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో అత్యంత ప్రమాదకరస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లోకి వరద నీరు రావడంతో శనివారం మధ్యాహ్నం వరకూ దాన్ని మూసివేయనున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో మెట్రో, రైళ్ల సేవలను కూడా రద్దు చేశారు. వర్షపు నీరు రాకతో పెరియార్‌ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలోని ముల్లపెరియార్‌, చెరుతోని, ఇడుక్కి, ఇదమలయార్‌తో సహా ఇతర ప్రధాన జలాశయాల గేట్లన్నింటినీ ఎత్తివేశారు. దీంతో పల్లపు ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలకు దినదిన గండంగా మారింది. అత్యంత ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస శరణాలయాలకు తరలించారు. దాదాపు 1.5లక్షల మంది పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్నారు. ముట్టోమ్‌ యార్డ్‌ ప్రాంతంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరడంతో మెట్రోరైల్‌ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కొచ్చి మెట్రో రైల్‌ లిమిటెడ్‌(కేఎంఆర్‌ఎల్‌) అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి మెట్రో సేవలను ప్రారంభిస్తామన్నారు. కొచ్చిలో కొన్ని చోట్ల రైళ్లు, బస్సు సర్వీసులు సైతం నిలిచిపోయాయి.
ముఖ్యమంత్రికి మోదీ ఫోన్‌..
కేరళ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరాతీశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.’ గురువారం ఉదయం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మరోసారి ఫోన్‌ చేశాను. రాష్ట్రంలో వరద పరిస్థితిపై
ఆరా తీశాను. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు మరింత పెంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రికి తెలియజేశాం. కేరళ ప్రజలకు అంతా మంచే జరగాలని ప్రార్థిస్తున్నా అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.
పోటెత్తిన పంబా నది..
కేరళను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.. పంబా నది పోటెత్తింది. పంబ నదిలో నీటి స్థాయి పెరిగిపోవడంతో శబరిమలకు వెళ్లే రెండు వంతెనలపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. మరోవైపు భారీ వర్షాలు పంబలో విధ్వంసం సృష్టించాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పంబా నదిలో నీటి స్థాయి పెరిగడంతో యాత్రికులు వెళ్లే రెండు వంతెనలతో సహా శబిరిమల ఆలయ పరిసరాల్లోని శిబిరాల్లోకి కూడా వరద నీరు చేరింది. ఆలయం చరిత్రలో తొలిసారిగా బుధవారం ఉదయం తంత్రీ లేకుండానే ‘నిరపుతరి’ వేడుకలు ప్రారంభించబడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పంబా నది ప్రవాహం దాటికి తంత్రి సహా ఆయన బృందం పుల్లూముడు గుండా శబరిమల వెళ్లాలని భావించినా… ఉప్పూతార వద్ద చిక్కుకున్నారు. దీంతో నిరాయుధురీ పూజకు బదులుగా, సీనియర్‌ పూజారి ఉన్నికృష్ణన్‌ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం మూసివేయబడింది. కొత్త మలయాళం నెల ప్రారంభంలో సందర్భంగా ఆలయం తెరిచి ఉంటుంది. ఓనం పండుగను తిరిగి ప్రారంభించే ముందు ఐదు రోజుల తర్వాత ఇది మళ్లీ మూసివేయబడుతుంది. కానీ, కనీవినీ ఎరుగని వర్షాలతో శబరిగిరులకు వెళ్లడం అసాధ్యమైపోయింది. అటవీ మార్గం వెంట అనేక ప్రదేశాల్లో చెట్లు కూలిపోయాయి. ఇక కేఎస్‌ఆర్టీసీ పంబాకు బస్సు సర్వీలను నిలిపివేసింది. నిలకల్‌ వద్ద యాత్రికులను ఆపడానికి, తిరిగి పంపించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పరిసర రాష్ట్రాల నుండి శబరిమలకు యాత్రికుల రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వరద పరిస్థితిపై కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యవేక్షణ..
కేరళలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల నీట మునిగాయి. నదువులు, వాగులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల నీట మునిగాయి. కేరళలో వరదల ఉధృతిపై కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యవేక్షిస్తున్నారు. కేళర సీఎం విజయన్‌కు ఫోన్‌ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని, కేంద్రం నుంచి బలగాలు పంపిస్తామని సీఎంకు రాజ్‌నాథ్‌ తెలిపారు. మరోవైపు విజయన్‌ ఎప్పటికప్పుడూ రాష్ట్ర ఉన్నతాధికారులతో, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కేరళ సీఎం విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి మరికొన్ని పడవలు, లైఫ్‌ జాకెట్లను అందించాల్సిందిగా రక్షణశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి నేతఋత్వంలో ఉన్నతస్థాయి కమిటీ గురువారం సమావేశమైంది. కేరళలో వరద బీభత్సం, సహాయక చర్యలపై సవిూక్షిస్తున్నారు. ఈ సమావేశానికి ¬ంశాఖ అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు హాజరయ్యారు. మరోవైపు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్‌ త్రివేండ్రమ్‌ వెళ్లారు. అక్కడే ఉండి వరద ఉదృతిపై, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లపై పర్యవేక్షణ చేస్తున్నారు.