కేరళ విపత్తు సెస్‌పై మంత్రుల కమిటీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : భారీ వర్షాలు, వరదలతో కకావికలమైన కేరళకు ఆర్థిక సాయం అందించడం కోసం విపత్తు సెస్‌ తీసుకురావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. కాగా.. ఈ ప్రతిపాదనను జీఎస్టీ మండలి పరిగణనలోకి తీసుకుంది. శుక్రవారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో విపత్తు సెస్‌పై సూచనలు చేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విూడియాతో మాట్లాడారు. ‘కేరళ ప్రభుత్వం ప్రతిపాదించిన విపత్తు సెస్‌ గురించి ప్యానెల్‌ చర్చించిందని అన్నారు. ఇదిచాలా కీలకమైన అంశం అని అన్నారు. దీనిపై సలహాలు, సూచనలు చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటుచేశామని జైట్లీ చెప్పారు. జీఎస్‌టీ మండలి సమావేశంలో భాగంగా రాష్ట్రాల ఆదాయం, లోటు తదితర అంశాలను సవిూక్షించారు. ఈ ఏడాది ద్రవ్యలోటు 13శాతంగా ఉందని, వచ్చే ఏడాదికి ఇది మరింత తగ్గుతుందని జైట్లీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు అంచనాలకు మించి నమోదయ్యాయని తెలిపారు.