కొనసాగుతున్న ఉగ్రవేట.. 

– మరో ఉగ్రవాది హతం
– మరో ఇద్దరికోసం గాలింపు ముమ్మరం చేసిన భద్రతాదళాలు
శ్రీనగర్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. బందిపొరా జిల్లాలోని హజిన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. హజిన్‌ప ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టామని, ఉగ్రవాదులు భద్రతాబలగాలపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు మరణించాడని, ఇంకా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని వెల్లడించారు. ఇదిలా ఉంటే గురువారం అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాబలగాలు ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రసంస్థ కీలక కమాండర్‌లలో ఒకడైన అల్తాఫ్‌ ధర్‌ అలియాస్‌ అల్తాఫ్‌ కచ్రూ కూడా మృతుల్లో ఉన్నాడు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు ప్రవేశించారనే సమాచారంతో భద్రతాబలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు నలుగురు పోలీసులను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతనాగ్‌లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్న కొంతసేపటికే ఈ ఘటన జరిగింది.