కొనుగోళ్లతో రైతులను ఆదుకోవాలి

త్వరగా పూర్తి చేయాలంటున్న అన్నదాతలు
వరంగల్‌,మే17(జ‌నం సాక్షి ): అకాల వర్షాలతో ఇబ్బంది ఉన్న నేపథ్యంలో అధికారులు స్పందించి ధాన్యాన్ని తూకాలు వేసి వెంటనే తరలించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కమలాపూర్‌  మార్కెట్‌ ఆవరణ పూర్తిగా నిండిపోయిందని, ఈనెల 28 వరకూ తీసుకురావద్దని అధికారులు అన్నారు. 29న మార్కెట్‌కు తీసుకురావాలని రైతులను కోరారు. కమలాపూర్‌ వ్యవసాయ ఉప మార్కెట్‌ యార్డు ఆవరణలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కమలాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని గత నెల 20న ప్రారంభించారు. తూకం వేసిన మొక్కజొన్నల తరలింపునకు లారీలు కొరత, సరిపడా హమాలీలు లేకపోవడంతో తూకంలో తీవ్ర జాప్యం జరిగింది. కేంద్రంలో మొక్కజొన్నల నిల్వలు భారీగా పేరుకుపోవడంతో మే 15 వరకు రైతులు మొక్కజొన్నలు కేంద్రానికి తేవద్దని అధికారులు సూచించడంతో ఎవరూ తీసుకురాలేదు. తర్వాత కమలాపూర్‌లోని మొక్కజొన్నల కొనుగోలు కేంద్రానికి భారీగా మొక్కజొన్నలు పోటెత్తాయి. ఒక్క రోజే 20 వేల క్వింటాళ్లకు పైగా మొక్కజొన్నలు రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఇప్పటికే 18,500 క్వింటాళ్లు కొనుగోలు చేయగా పెద్ద మొత్తంలో మక్కలు రావడంతో నిర్వాహకులు అవాక్కయ్యారు. బుధవారం తీసుకురావాలని ప్రకటించడంతో  రైతులు మొక్కజొన్నలను ట్రాక్టర్ల ద్వారా కేంద్రానికి తరలించారు. రాత్రి నుంచి బుధవారం పెద్ద మొత్తంలో ట్రాక్టర్లలో కేంద్రానికి చేరుకున్నాయి. కేంద్రం తాళం తీయకపోవడంతో హుజూరాబాద్‌- పరకాల రహదారికి ఇరువైపులా సుమారు రెండు కిలోవిూటర్ల మేర ట్రాక్టర్లు వరుసగా నిలిచిపోయాయి. రాత్రి నుంచే రైతులు టోకెన్ల కోసం పడిగాపులు పడ్డారు. మార్కెట్‌ ఆవరణ పూర్తిగా నిండిపోయిన వెంటనే నిర్వాహకులు గేట్లు వేశారు. అయితే అకాల వర్షాల భయంతో త్వరగా కొనుగోలు జరిపి పంపించాలని రైతులు కోరారు.