కొలిక్కిరాని సీట్ల వ్యవహారం

ఢిల్లీలోనే మకాం వేసిన ఉత్తమ్‌,జానా
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మహా కూటమిలో సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దిల్లీ చేరుకున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డి  ఉదయం నుంచి అధిష్టాన పెద్దలతో సమాలోచనలు జరుపుతున్నారు. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, మెనిఫెస్టో సహా పలు అంశాలపై వారు చర్చిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి పార్టీ 25 స్థానాలు కోరుతుండగా, భారత కమ్యూనిస్టు పార్టీ, సీపీఐ 12 స్థానాలు ఆశిస్తున్నట్లు సమాచారం. తెరాస ఓటమే ప్రధాన ధ్యేయమంటోన్న తెలుగుదేశం పార్టీ 19 సీట్లకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఆయా పార్టీలు అడిగిన మేరకు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు. టీజేఎస్‌, సీపీఐకి చెరో మూడు సీట్లు కేటాయించి… తెలుగుదేశానికి 10-12 సీట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లాల్లో సీటల్‌ వ్యవహారం కూడా ఆలోచించాల్సి ఉంది. కూటమి వల్ల జిల్లాల్లో అసంతృప్తి చెలరేగే ప్రమాదం ఉంది.