కొలువుదీరిన కర్ణాటక మంత్రివర్గం

– మంత్రులుగా 17మంది ప్రమాణ స్వీకారం
– ప్రమాణం చేయించిన గవర్నర్‌ బాజూభాయ్‌ వాలా
బెంగళూరు, ఆగస్టు20(జనం సాక్షి) : కర్ణాటకలో మంత్రి వర్గవిస్తరణ జరిగింది. కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన క్యాబినెట్‌లో 17 మందికి స్థానం కల్పించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 17మందిచేత గవర్నర్‌ బాజూభాయ్‌ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో గోవింద మఖ్తప్ప, డాక్టర్‌ ఆశ్వంత్‌ నారాయణ్‌ సీఎస్‌, లక్ష్మణ్‌ సంగప్ప సవడి, ఆర్‌.ఆశోక, బి.శ్రీరాములు, ఎస్‌.సురేష్‌ కుమార్‌, వి.సోమన్న, కోట శ్రీనివాస్‌ పూజారి, జేసీ మధుస్వామి, చంద్రకాంత్‌ గౌడ చెన్నప్ప గౌడ పాటిల్‌, హెచ్‌.గణెళిష్‌, ప్రభు చౌహన్‌, జొల్లే శశికళ, కేఎస్‌ ఈశ్వరప్ప, జగదీష్‌ షెట్టర్‌, సీటీ రవి, బి.బస్వరాజ్‌ ఉన్నారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. జులై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడియూరప్ప.. 29న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. కొత్త మంత్రి వర్గం మాత్రం ఏర్పాటు కాలేదు. మూడు వారాల పాటూ కేబినెట్‌పై కసరత్తు చేసిన సీఎం యడియూరప్ప.. 17మంది జాబితాను అధిష్టానానికి పంపించారు. అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రివర్గం కొలువు దీరడంతో ఇక పూర్తిస్థాయి పాలనపై ఫోకస్‌ పెట్టనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎవరికి ఏ శాఖను కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. కీలక శాఖలకు యడియూరప్ప ఎవరికి అప్పగిస్తారనేదానిపై చర్చ సాగుతుంది.