కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం..
` రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు!
` ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల నుంచి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం
దిల్లీ,సెప్టెంబరు 28(జనంసాక్షి):కరోనా వైరస్ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌తో మృతి చెందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి కింద వీటిని అందజేయాలని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇదే సమయంలో దీనిపై స్పందించిన ఒడిశా ప్రభుత్వం.. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం ఇస్తామని ప్రకటించింది.కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య పరిశోధనా మండలి (ఎఅఓఖీ) నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం.. ధ్రువీకరించిన కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. దేశంలో కొవిడ్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకూ మరణించిన కేసులకే కాకుండా భవిష్యత్తులో కొవిడ్`19తో సంభవించే మరణాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ పరిహారం మొత్తాన్ని రాష్ట్ర విపత్తు స్పందన నిధి కింద అందజేసే చర్యలు చేపట్టాలని రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలంటూ న్యాయవాది గౌరవ్ కుమార్ బన్సాల్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ (ఔఆఓం) సిఫార్సు చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందజేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా వీటిని ప్రస్తావించిన సుప్రీం కోర్టు.. కొవిడ్‌తో మృతి చెందిన కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసించింది. బాధిత కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఊరట కలిగిస్తుందని అభిప్రాయపడిరది. దీనిపై తుది తీర్పును అక్టోబర్ 4వ తేదీన సుప్రీం కోర్టు వెలువరించనుంది.