కోనసీమలో మళ్లీ పెరుగుతున్న కేసులు

అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు
వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని సూచన
కాకినాడ,అక్టోబర్‌30  (జనంసాక్షి) : కోనసీమలో గత ఐదు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన దసరా ఉత్సవాలు, వివిధ రాజకీయ పార్టీల ఆందోళనల నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగింది. దీంతో స్థానికులు మళ్లీ థర్డ్‌వేవ్‌ వచ్చిందా అని అనుమానాలతో భయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దసరా ఉత్సవాలు, పార్టీల ఆందోళన విధుల్లో పాల్గొన్న పది మంది పోలీసు సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది. ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు సైతం కొవిడ్‌ బారిన పడుతున్నారు. అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఒక సీఐ, ఐదుగురు ఎస్‌ఐలు, నలుగురు పోలీ సు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల దసరా ఉత్సవాల సందర్భంగా విధుల్లో పాల్గొన్న పోలీసులకు కరోనా
సోకడంతో జనాల్లో కూడా పాజిటివ్‌ రేట్‌ అధికంగా ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. తాజాగా అల్లవరం మండల తహశీల్దార్‌ సహా అక్కడ పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు పాజిటివ్‌గా తేలింది. రాజోలు మండలం తాటిపాక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజుల నుంచి డివిజన్‌లో కేసుల సంఖ్య నిల్‌గా ఉన్నా 41 కేసులు నమోదయ్యాయి. ఇలా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వపరంగా వైద్యసేవలు అందడం లేదు. ఇక అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఎత్తివేసారు. ఇక్కడ వైద్య సేవలు కొనసాగించాలని కోరుతున్నారు. వ్యాక్సినేషన్‌పై గ్రావిూణ ప్రాంత ప్రజలలో అపోహలను తొలగించి నూరు శాతం పూర్తి చేయడానికి సచివాలయ కార్యదర్శులు కృషిచేయాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రావాలన్నారు. వ్యాక్సిన్‌తోనే రక్షణ ఉంటుందన్నారు.