కోర్టులో విచారణలు లైవ్‌లో..!

– అనుమతిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం
– సుప్రింకోర్టు నుంచే లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రారంభమవుతుందని వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : కోర్టుల్లో జరిగే వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ పక్రియ సుప్రీంకోర్టు నుంచే ప్రారంభమవుతుందని వెల్లడించింది. ప్రత్యక్ష ప్రసారం వల్ల న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే.. నియమాలు ఉల్లంఘించకుండా ప్రత్యక్ష ప్రసారం ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. న్యాయస్థానాల్లో జరిగే విచారణలు ప్రజలకు తెలిసేలా చేయాలంటూ సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌తో పాటు ఇతరులు వేసిన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై తీర్పును బుధవారం వెలువరించారు. కోర్టులో జరిగే విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలుసుకోవాలనుకోవడం ప్రజల హక్కుగా న్యాయస్థానం అభిప్రాయపడింది. దీని వల్ల న్యాయవిచారణలో మరింత పారదర్శకత ఏర్పడుతోందని పేర్కొంది.