క్యాంటీన్‌కు నిప్పంటించిన ఘటనలో ఐదుగురిపై కేసు

బెంగళూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): హస్సన్‌ జిల్లాలోని ఓ క్యాంటీన్‌కు నిప్పంటించిన ఘటనలో కర్ణాటక పోలీసులు ఐదుగురు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జనవరి 31న ఇద్దరు మహిళలు నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో గోమాంసం  వండుతున్నారన్న అనుమానంతో.. భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ఆ క్యాంటీన్‌పై దాడి చేశారు.క్యాంటీన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి..నిప్పంటించారు. అంతేకాకుండా క్యాంటీన్‌ నడుపుతున్న ఖమ్రున్నీసా (70), షామిమ్‌ (50)లపై బెదిరింపులకు దిగారు. ఆ తర్వాత క్యాంటీన్‌లో తనిఖీలు చేయగా..ఎలాంటి బీఫ్‌ కనిపించలేదని హస్సన్‌ జిల్లా ఎస్పీ ఏఎన్‌ ప్రకాశ్‌ గౌడ తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయమంటే పట్టించుకోలేదని ఖమ్రున్నీసా తెలిపింది. తాము ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదని, ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లినపుడు రాత్రి 11 గంటల వరకు పీఎస్‌లోనే ఉన్నామని తెలిపింది. ఐదుగురు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలపై ఐపీసీ 323, 354, 427, 436, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ తెలిపారు.