క్రికెట్ వివాదంలో ఏడుగురి ప్రాణం తీసింది
– పాకిష్థాన్‌లో విషాధ ఘటన
పెషావర్, నవంబర్24(జనంసాక్షి) : క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారుల మధ్య మొదలైన స్వల్ప వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అబోట్టాబాద్ జిల్లాలోని పోలీస్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. కొందరు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటుండగా వారి మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్తా వారి తల్లిదండ్రుల దాకా వెళ్లింది. పిల్లల తల్లిదండ్రులు కూడా గొడవపడి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ పోస్టు వద్దకు వచ్చారు. పోలీసుల ఎదుట కూడా వీరంతా ఘర్షణకు దిగారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.