క్లెయింల పరిష్కారం వేగవంతం

– యాక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి4(జ‌నంసాక్షి) : తమ వినియోగదారుల వాహనాలకు సంబంధించిన క్లెయింలను త్వరిత గతిన పరిష్కరించనున్నట్లు ప్రైవేటు రంగ భారతీ యాక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ సోమవారం తెలిపింది. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని భాగస్వామ్య గ్యారేజీల ద్వారా మరమ్మతులతో పాటు, క్లెయింలను వేగంగా పరిష్కరిస్తామని తెలిపింది. వాహన బీమా రంగంలోకి అడుగుపెట్టిన ఏడాదిలోనే ఈ పద్ధతి ద్వారా 20-25శాతం క్లెయింలను పరిష్కరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అవసరమైతే లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ప్రమాద పరిస్థితిని అంచనా వేసి అప్పటికప్పుడే చెల్లింపులు జరుపుతామని భారతీ యాక్సా తెలిపింది. ఇందుకోసం భారతీ యాక్సా తన వినియోగదారులకు ఈ-సర్వే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాహనానికి జరిగిన నష్టాన్ని వీడియో రూపంలో అందులో పోస్ట్‌ చేయడం ద్వారా సంస్థ దాన్ని పరిశీలిస్తుంది. ‘స్మార్ట్‌ ఈ-సర్వే ద్వారా వినియోగదారుల వాహనాలను త్వరతగతిన గ్యారీజీలకు అనుసంధానం చేయడం ద్వారా వేగంగా క్లెయింలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది.’ అని కంపెనీ సీఈవో సంజీవ్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. వినియోగదారుడు పోస్ట్‌ చేసిన వీడియోను ధ్రువీకరించుకున్న తర్వాత ఎంత మొత్తంలో క్లెయిం అవుతుందో అంచనా వేసి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.