క్షయ వ్యాధి పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

క్షయ వ్యాధిపై అవగాహన కల్పించిన డాక్టర్ నరేష్

టేకులపల్లి ,సెప్టెంబర్ 8 (జనం సాక్షి ): క్షయ వ్యాధిపై ప్రజల ప్రభుత్వం గా ఉండాలని సులానగర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ కోరారు. శుక్రవారం మండల పరిధిలోని లచ్యాతండా, సింగ్యా తండా గ్రామాల కూడలిలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2025 సంవత్సరం కల్లా భారతదేశం నుండి సమూలంగా క్షయవ్యాధిని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యంపై పగడ్బందీగా దృష్టి సారించిన సందర్భంగా ప్రతి ఒక్కరు వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని, క్షయ వ్యాధి లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు,జ్వరం , ఆకలి లేకపోవడం , బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి వారికి తెమడ పరీక్ష ఎక్స్ రే, సిబి నాట్ (CB NAAT) మొదలగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి తరువాత వ్యాధి నిర్ధారణ జరిగినట్లయితే వెంటనే ఉచితంగా చికిత్స అందించడం జరుగుతుంది అని అన్నారు. పూర్తి ఉచితంగా అందజేసే చికిత్సతో కచ్చితంగా వ్యాధిని తగ్గించడానికి అవసరమైన మందులు ఇవ్వడంతో పాటు బరువుని బట్టి మందులు ఇస్తారని అన్నారు. రెగ్యులర్ గా పర్యవేక్షణ ఉంటుంది అని దీంతో పాటు పోషకాహారం నిమిత్తం వ్యాధిగ్రస్తులకు ప్రతినెల అతని బ్యాంక్ అకౌంట్లో 500 రూపాయలు నెల నెలా ఇవ్వడం జరుగుతుంది అని ఇలాంటి అవకాశాలు ప్రైవేటు ఆసుపత్రిలో లభించవు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 15 మంది అనుమానిత వ్యక్తుల నుండి పరీక్ష నిమిత్తం తెమడ సేకరించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు డివిజన్ క్షయ వ్యాధి పర్యవేక్షకుడు శంకర్, ఏఎన్ఎం పరంగిని, రమేష్ బాబు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.