ఖరీఫ్‌ సాగుకు విత్తనాలు సిద్దం

వరంగల్‌,మే31 : ఖరీఫ్‌ సాగుకు ఎరువులతోపాటు విత్తనాలను అధి కారులు అందుబాటులో పెట్టారు. రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోనే వస్తాయని  వాతావరణశాఖ  అధికారులు పేర్కొనడంతో రైతులు పనుల్లో నిమగ్నమయ్యూరు. ఈ ఖరీఫ్‌లో వర్షాలు ముందే పలకరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ ఆదేశించారు. ప్రభుత్వం కూడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టడంతో కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు ప్రధాని పసల్‌ బీమాయోజనపై చైతన్యం చేస్తున్నారు. గత ఏడాది ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు ఆ కష్టాల నుంచి ఇంకా కోలుకోలేదు. అప్పులపాలయిన అన్నదాతలు మళ్లీ గంపెడాశలతో ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సారైనా కాలం కలిసిరాకపోతుందా అని వానదేవుడిపైనే ఆశలన్ని పెట్టుకుని సాగుకు సమాయత్తమవుతున్నారు. ఖరీఫ్‌ సాగుకు అవసరమైన  ఎరువుల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. యూరియ డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ ఎరువులు రైతుల సాగుకు సరిపడ డిమాండ్‌ మేరకు అందిస్తామని జేడీఏ తెలిపారు. రైతులను ఎల్‌నినో ప్రభావం వెంటాడే పరిస్థితి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. ఈసారి కూడా రైతన్నలు పంటల సాగు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరి,పత్తి తదితర విత్తనాలను అందుబాటులో ఉంచామని అధికారులు అన్నారు.  విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేటు సంస్థల ద్వారా రైతులకు అందిస్తామని జేడీఏ తెలి పారు. అలాగే మొక్కజొన్న సాధారణ సాగు కోసం 10 వేల 256 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉన్నాయని, ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇకపోతే ప్రధాని ఫసల్‌ బీమా యెజన ఉపియోగించుకోవాలన్నారు.