గట్టెక్కిన థెరెసా మే ప్రభుత్వం
– వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
– 19ఓట్ల తేడాతో గెలుపొందిన కన్జర్వేటివ్ ప్రభుత్వం
లండన్,జనవరి17(జనంసాక్షి): బ్రిటన్ ప్రధాని థెరిసా మే అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెకారు. బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి థెరిసా మే ప్రభుత్వం గట్టెక్కింది. బ్రెగ్జిట్ అంశంపై యూరోపియన్ యూనియన్‌తో (ఈయూ సమాఖ్య) చేసుకున్న ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంట్‌లో నిర్వహించిన చారిత్రక ఓటింగ్‌లో థెరిసా మే ఓటమి పాలైన విషయం తెలిసిందే. బ్రెగ్జిట్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ 432 మంది, ఆమోదిస్తూ 202 మంది ఎంపీలు ఓటు వేశారు. ప్రధాని సొంత పార్టీ అయిన కన్జర్వేటివ్స్‌కు చెందిన వందమందికిపైగా సభ్యులు కూడా తీర్మానాన్ని వ్యతిరేకించారు. బ్రెగ్జిట్ డీల్ ఓటమి ఈ నేపథ్యంలో ఆ వెంటనే ప్రధాని థెరిసా మేపై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్‌లో 19ఓట్ల తేడాతో కన్జర్వేటివ్ ప్రభుత్వం గెలుపొందింది. దీంతో బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా ప్రతిపక్ష నేతలను ప్రధాని థెరిసా ఆహ్వానించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై వేగంగా నిర్ణయానికి రావాలని కోరారు. పార్లమెంట్‌లో 325 మంది ఎంపీలు థెరిసాపై అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయగా.. 306 మంది ఎంపీలు అనుకూలముగా ఓటు వేశారు. దీంతో లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గిన థెరెసా ముందు రాజకీయపక్ష అవిశ్వాస తీర్మానం సవాల్ గా మారింది. 14రోజుల్లో ఈ తీర్మానం వీగిపోతే సరి. లేదంటే బ్రిటన్ లో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది.