గడ్కరీ రాజకీయ వ్యాఖ్యలపై కలకలం

సొంత పార్టీ నేతలను ఉద్దేశించినవే అన్న కాంగ్రెస్‌

కాదుకాదు.. కాంగ్రెస్‌ను ఉద్దేశించినవే అంటూ బిజెపి ప్రతివిమర్శలు

న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): కలల్లో విహరింపజేసి, వాటిని సాకారం చేయడంలో విఫలమైన వారిని ప్రజలు చితగ్గొడతారంటూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌ బిజెపిలు దీనిపై పరస్పర విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలను ఉద్దేశించే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు విమర్శించాయి. అయితే దీనిపై భాజపా స్పందిస్తూ కాంగ్రెస్‌ విమర్శలను తిప్పికొట్టింది. గడ్కరీ తమను ఉద్దేశించి కాదని, కాంగ్రెస్‌ను ఉద్దేశించే గడ్కరీ మాట్లాడారని స్పష్టం చేసింది. నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ దాని నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ గడ్కరీ కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ గతంలో గరీబీ హఠావోఅనే నినాదాన్ని ఇచ్చింది. కానీ పేదరికాన్ని నిర్మూలించేందుకు ఆ పార్టీ ఏవిూ చేయలేదు. ఇప్పుడు రాహుల్‌గాంధీ కూడా అలాంటి హావిూలే ఇస్తున్నారు. వారిని ఉద్దేశించే గడ్కరీ ఆ వ్యాఖ్యలు చేశారు’ అని భాజపా ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు సోమవారం విూడియాతో అన్నారు. గడ్కరీ నిన్న ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నేను కేవలం మాటలు చెప్పేవాడిని కాను. ఏం చెప్పానో అది 100 శాతం నెరవేరుస్తా. కలల్లో విహరింపజేసి, వాటిని సాకారం చేయడంలో విఫలమైన వారిని ప్రజలు చితగ్గొడతారు’ అని అన్నారు. గడ్కరీ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్‌.. ‘కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి వారు చాలా మంది భాజపా నుంచి వస్తారు’ అని విమర్శించింది. అటు మజ్లీస్‌ నేత, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందిస్తూ.. ‘ప్రధాని గారు.. గడ్కరీ మిమ్మల్ని అద్దంలో చూపిస్తున్నారు. అది కూడా చాలా సూక్ష్మంగా’ అంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమిపాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గడ్కరీ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఆ మధ్య ఓటమితో పాటు వైఫల్యాలనూ అంగీకరించే ధోరణి పార్టీ నాయకత్వానికి ఉండాలంటూ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల గణతంత్ర వేడుకల్లో గడ్కరీ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పక్కనే కూర్చోవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.