గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇర్వింగ్ మేయర్
డల్లాస్,జనవరి28(జనంసాక్షి): అమెరికాలోని డల్లాస్‌లో 70వ గణతంత్ర వేడుకలు ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకొన్నారు. నార్త్ టెక్సాస్ మహాత్మా గాంధీ స్మారక సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. వేడుకలను ముఖ్యఅతిథిగా ఇర్వింగ్ పట్టణ మేయర్ ఆస్కార్ వార్డ్ హాజరయ్యారు. ఉన్నత సమాజ నిర్మాణంలో భారతీయులు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన ఇర్వింగ్ కౌన్సిల్ సభ్యుడు ఆలన్ మేగర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్, అతి పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. అమెరికాలోనే అతి పెద్ద గాంధీ స్మారకంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో ఈ వేడుకలు జరిగాయి. సంస్థ ఛైర్మన్ డా.తోటకూర ప్రసాద్ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన భారత రాజ్యాంగ విశిష్టతను వివరించారు. స్వాతంత్య సమరయోధుల సేవలను గుర్తుచేశారు. భారతదేశంలో ఇటీవల చోటుచేసుకున్న మార్పులను ఉటంకిస్తూ.. సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించామని.. చేయాల్సింది ఇంకా ఉందని గుర్తుచేశారు. భారతీయ అమెరికన్లుగా రెండు దేశాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో సంస్థ కోఛైర్మన్ బీఎన్.రావు, కార్యదర్శి కల్వల రావు, కోశాధికారి అభిజిత్ రాయ్‌కర్‌తో పాటు దాదాపు 150 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.