గణతంత్ర వేడుకల భగ్నానికి ఉగ్రకుట్ర

భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): గణతంత్ర దినోత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకునే భారతీయులపై పెద్ద ఎత్తున దాడి చేయాలని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్‌, ఆ పరిసర ప్రాంతాల్లో గ్రెనేడ్‌ దాడులు జరిపిన ఓ ఉగ్రవాది దేశ రాజధాని నగరం ఢిల్లీలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు ఈ కుట్రను గురువారం భగ్నం చేశారు. ఢిల్లీ పోలీసులు విూడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది ఢిల్లీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ బృందం దర్యాప్తు చేశారు. ఈ ఉగ్రవాది ఇటీవల శ్రీనగర్‌, పరిసర ప్రాంతాల్లో జరిగిన గ్రెనేడ్‌ దాడుల సూత్రధారి అబ్దుల్‌ లతీఫ్‌ గణాయ్‌ అని నిర్థారణ అయింది. అబ్దుల్‌ లతీఫ్‌ గణాయ్‌ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలో ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో శ్రీనగర్‌ తరహా దాడులు చేసేందుకు కుట్ర పన్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నేరపూరిత పుస్తకాలు, ఇతర వస్తువులు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గణాయ్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా జమ్మూ-కశ్మీరులోని బందిపొరలో మరొక ఉగ్రవాది హిలాల్‌ను అరెస్టు చేసి, రెండు ఐఈడీ/గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నామని, తెలిపారు. హిలాల్‌ ఇప్పటికే డిల్లీలో రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని జమ్మూ-కశ్మీరు పోలీసులకు అందజేశామని తెలిపారు. అనంతరం ఆ రాష్ట్ర పోలీసులు గ్రెనేడ్‌ దాడులతో ప్రమేయమున్నవారిని అరెస్టు చేశారని చెప్పారు.