గణాంకాల సంఘానికి..  ఇద్దరు సభ్యుల రాజీనామా


– ప్రభుత్వం, కమిషన్‌ మధ్య విబేధాలే కారణం
– మా బాధ్యతలను మేం సరిగా నిర్వర్తించలేక పోతున్నాం
– అందుకే రాజీనామా చేశామన్న మోహనన్‌
– కేంద్రం నిర్లక్ష్యంతో మరో సంస్థ నిర్వీర్యమైంది – చిదంబరం
న్యూఢిల్లీ, జనవరి30(జ‌నంసాక్షి) : ఉద్యోగాల డేటాపై ప్రభుత్వం, కమిషన్‌ మధ్య విబేధాలు తలెత్తడంతో జాతీయ గణాంకాల సంఘం(నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌) నుంచి ఇద్దరు స్వతంత్ర సభ్యులు రాజీనామా చేశారు. తాత్కాలిక ఛైర్‌పర్సన్‌ పీసీ మోహనన్‌, మరొకరు స్వతంత్ర సభ్యురాలు జేవీ విూనాక్షి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఇటీవల గణాంకాల కమిషన్‌ విడుదల చేసిన ఉద్యోగాల డేటాపై ప్రభుత్వం, కమిషన్‌ మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరు రాజీనామా చేశారు. రాజీనామాపై మోహనన్‌ మాట్లాడుతూ.. ‘ఈ మధ్యకాలంలో గణాంకాల కమిషన్‌ సమర్థవంతంగా పనిచేయట్లేదని, అంతేగాక గత కొన్ని నెలలుగా కమిషన్‌లో మమ్మల్ని పక్కనబెడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మా బాధ్యతలను మేం సరిగా నిర్వర్తించలేమని భావించామని, అందుకే మా పదవుల నుంచి తప్పుకొంటున్నామని చెప్పారు. మోహనన్‌, విూనాక్షి 2017 జూన్‌లో కమిషన్‌ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. వీరి పదవీకాలం 2020 జూన్‌ వరకు ఉంది. గణాంకాల కమిషన్‌లో ఏడుగురు సభ్యులు ఉండాలి. అయితే ఇప్పటికే ఇందులో మూడు పదవులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా వీరి రాజీనామాతో కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఇద్దరికి పడిపోయింది. ప్రస్తుతం ప్రధాన గణాంకాల అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ, నీతీ ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సభ్యులుగా ఉన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరో సంస్థ నిర్వీర్యమైంది – చిదంబరం
కేందప్రభుత్వంతో తలెత్తిన విభేదాలతో జాతీయ గణాంకాల కమిషన్‌ నుంచి ఇద్దరు సభ్యులు రాజీనామా చేయడం రాజకీయ దుమారానికి తెరలేపింది. ఈ విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరో సంస్థ మరణించిందంటూ ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరో గౌరవప్రదమైన సంస్థ మరణించిందని, దీని పట్ల మేం సంతాపం ప్రకటిస్తున్నామని చిదంబరం ట్వీట్‌లో పేర్కొన్నాడు. జీడీపీ, ఉద్యోగుల డేటాను నిజాయతీగా విడుదల చేసేందుకు ఆ సంస్థ చేసిన పోరాటాన్ని మేం గుర్తుంచుకుంటామని చిదంబరం ట్వీట్‌ చేశారు.