గాంధీజీ.. జిన్నాను ప్రధాని చేయాలనుకున్నారు

– అలా చేసుంటే అవిభాజ్య భారత్‌ ముక్కలయ్యేది కాదు

– బౌద్ధ గురువు దలైలామా

పనాజి, ఆగస్టు8(జ‌నం సాక్షి) : మహ్మద్‌ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్‌ ముక్కలయ్యేది కాదని బౌద్ధ గురువు దలైలామా అన్నారు. గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగావిద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ ఓ విద్యార్థి ఆయనను ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తారన్న దలైలామా.. ఇందుకు భారత మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ వంటి గొప్ప వ్యక్తులు కూడా అతీతం కాదంటూ సమధానమిచ్చారు. మహ్మద్‌ అలీ జిన్నాను ప్రధాని చేయాలని మహాత్మా గాంధీ భావించారని, కానీ అందుకు నెహ్రూ ఒప్పుకోలేదన్నారు. తాను ప్రధాని అవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారని, ఒకవేళ నెహ్రూ గనుక ఆ తప్పు చేయకపోయి ఉంటే జిన్నా ప్రధాని అయ్యేవారని అన్నారు. జిన్నా ప్రధాని అయ్యుంటే భారతదేశం.. భారత్‌, పాకిస్తాన్‌గా విడిపోయేది కాదంటూ పేర్కొన్నారు. అయినా తప్పులు జరగడం సహజం అని దలైలామా వ్యాఖ్యానించారు.