గిట్టుబాటు ధర అందక మొక్కజొన్న రైతుల ఆందోళన
వరంగల్,ఏప్రిల్1: వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మళ్లీ మక్కజొన్న రైతు దగా పడ్డాడు. అమ్మకానికి తీసుకుని వచ్చిన సరుకు సరిగా లేదని అధికారులు తిరస్కరసి/-తున్నారని ఆందోళన చెందుతున్నారు. తమకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నామని అన్నారు. ప్రతి రోజు రెండువేల మొక్కజొన్నల బస్తాలు అమ్మకానికి వస్తున్నాయి. మార్క్ఫెడ్ మాత్రం రూ.1310 ప్రకారం ఒకే రకమైన మొక్కజొన్నలు ఖరీదు చేస్తూ మిగిలినవి వదిలేయడం ఇబ్బందికరంగా మారుతున్నాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నలు ఖరీదు ప్రారంభించినా తమకు మద్దతు ధర రూ.1310 అందడంలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘ఏ’ గ్రేడ్ ఒకే రకం మొక్కజొన్నలు కొనుగోలు చేపట్టడంతో నాణ్యత తగ్గినా మొక్కజొన్నలను ఖరీదు చేసే వారే కరవయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోరి కొనుగోళ్లు చేపట్టినా ఆశించిన ఫలితం అందడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో రైతులను తెగ ఇబ్బంది పెట్టిన అధికారి మళ్లీ ఖరీదు చేసేందుకు రావడంతో రైతుల్లో అసహనం పెరిగిపోయింది. నాణ్యమైన సరకులైనా సరే సీఈవో చూడకుండానే కొనుగోలు నిరాకరిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తేమ యంత్రంతో మొక్కజొన్నలు బాగున్నా, ఇవి మాకు వద్దంటూ తిరస్కరించడంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేటు వారికి అమ్ముకోవాల్సి వస్తోంది. మార్క్ఫెడ్ నిబంధనల మేరకు 14 శాతం తేమ ఉంటే కొనాల్సి ఉండగా, 13.05 శాతం ఉన్న సరకులను సైతం వద్దని నిరాకరించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మార్క్ఫెడ్ వారు కొంటారని ఆశపడ్డా, నాపగింజలు ఉన్నాయనే సాకుతో కొనమని సీఈవో కుమారస్వామి నిరాకరిస్తే గత్యంతరం లేక ప్రైవేటు వారికి
అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. తేమ యంత్రం ద్వారా పరిక్షిస్తే 13.05 మాత్రమే తేమ వచ్చిందని, కొంటారని అనుకునే లోపలే రెండు రకాల గింజలు ఉన్నాయని సీఈవో నిరాకరించారని వాపోతున్నారు. మార్క్ఫెడ్ కాదంటే ఇక ప్రైవేట్ వ్యాపారులను తక్కువ ధరలకు ఆశ్రయించాల్సి వస్తోందని అన్నారు. అయితే రైతుల పట్ల పక్షపాతం చూపించడం లేదని, సరకు నాణ్యతను బట్టే ఖరీదు చేస్తున్నానని అధికారి చెబుతున్నారు.