గిరిజన మహిళపై ఏక్సైజ్ అధికారుల పాశవిక దాడి.

ఫోటో రైటప్: ఏక్సైజ్ అధికారుల దాడిలో గాయపడిన మహిళ దరావత్ రుక్మి.
బెల్లంపల్లి, ఆగస్టు19, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం లంబడి తండా గ్రామంలో శుక్రవారం చెన్నూరుఎక్సైజ్ అధికారులు గిరిజన మహిళాపై పాశవికంగా దాడి చేసిన ఉదంతం వెలుగుచూసింది. బాధితురాలు దరావత్ రుక్మి కథనం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఎక్సైజ్ అధికారులు తమ ఇంటి తలుపు తట్టగా తాను తలుపు తీయడంలో అధికారులు సిబ్బంది తమ ఇంట్లో చొరబడి మూటలు, ముల్లెలు పెట్టి ఏమి మాట్లాడకుండా ఒక్కసారిగా తనపై పాశవికంగా దాడికి తెగబడ్డారని బాధితురాలు కన్నీటి పర్యంతం అయింది. దాడి సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనపై దాడిని అడ్డుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేసింది. ఏక్సైజ్ అధికారులు చెప్పరాని చోట తీవ్రంగా గాయపరిచారని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో తన దుస్తులు చిరిగి పోయిన కూడా కనికరం చూపలేదని, వారి దాడితో తాను తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తన భర్త వచ్చి ఓదార్చడని ఆమె విలపిస్తూ తెలిపింది. అకారణంగా తనపై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు.