గిరిజన రైతులకు అందని చెక్కులు

ఆందోళనలో రైతులు
మహబుబాబాబాద్‌,మే16(జ‌నం సాక్షి):  పెట్టుబడి సాయం పేరుతో ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం వేలాది మంది గిరిజన రైతులకు అందడం లేదు. అటవీ భూముల్లో 50 ఏళ్లకుపైగా సాగులో ఉన్నా వారికి అటవీహక్కుల పత్రాలు ఇవ్వకుండా చెల్లని పాస్‌పుస్తకాలను అంటగట్టి అధికారులు కాలం వెల్లదీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబంధులో అటవీశాఖకు చెందిన భూములుగా సదరు రైతుల కమతాలను పేర్కొంటూ పెట్టుబడి సాయం అందకుండా నిలిపివేశారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పెట్టుబడి సహాయాన్ని అటవీభూముల్లో సాగు చేస్తున్న వారికి ఇవ్వడంలేదు. అటవీహక్కు పత్రాలున్న వారికి మాత్రం పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే వీరికి అటవీహక్కు పత్రాలివ్వకుండా ఏళ్ల తరబడి అధికారులు జాప్యం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. కేసముద్రం మండలం రంగాపురం గ్రామంలో సుమారు 500 మంది రైతులుంటే కేవలం 125 మంది రైతులకు రూ.6,87,200ల విలువైన చెక్కులు అందాయి. రంగాపురంతోపాటు శివారులోని రాజీవ్‌నగర్‌తండా, సింగిలాల్‌తండాల్లో సగానికిపైగా రైతులు సాగు చేస్తున్నది అటవీశాఖకు చెందిన భూములని అధికారులు పేర్కొంటున్నారు. అయితే సదరు రైతుల వద్ద అప్పటికే పట్టాదారు పాస్‌పుస్తకాలుండడం విశేషం. వీటిపై యూనిక్‌ నెంబరు సైతం వేసి ఉన్నాయి. వీటి ఆధారంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. వీరి పొలాలు, చెల్కలకు విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేయడమే కాకుండా వ్యవసాయ బావులు సైతం తవ్వుకుని అర్ధశతాబ్ధానికి పైగా తాతలు, తండ్రుల నుంచి వ్యవసాయం చేస్తున్నారు.