గుట్కా స్కాంలో సీబీఐ దాడులు ముమ్మరం

– చెన్నైలో మంత్రి, డీజీపీతో సహా పలువురు ఇళ్లలో సోదాలు
– 40 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు
చెన్నై, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : తమిళనాడులో గుట్కాస్కాం మళ్లీ తెరపైకి వచ్చింది. స్కాంలో దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. మంత్రి సహా పలువురు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు చేశారు. కోట్ల రూపాయల విలువైన చెన్నై గుట్కా కుంభకోణంతో సంబంధం ఉందనే అనుమానంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సి.విజయ భాస్కర్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ టీకే రాజేంద్రన్‌, మాజీ కమిషనర్‌ జార్జితో సహా మరికొందరు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 40 చోట్ల సీబీఐ బృందాలు దాడులకు దిగాయి. తమిళనాడులో నమిలే పొగాకు ఉత్పత్తులను నిషేధించినప్పటికీ అమ్మకాలు కొనసాగుతుండటంపై ఈఏడాది ఏప్రిల్‌లో మద్రాస్‌ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. గతంలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఓ వ్యాపారికి సంబంధించిన ఆస్తులపై దాడులు చేయగా వారికి ఓ డైరీ లభించింది. అందులో లంచాలు ఇచ్చిన వారి జాబితాలో పలువురు రాజకీయ నాయకులు, సీనియర్‌ పోలీసు అధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో హైకోర్టు ఈ కేసును ఇటీవల సీబీఐకి అప్పగించింది. ఇప్పుడు సీబీఐ ఆ దిశగా విచారణ ప్రారంభించింది. బ్లాక్‌ మార్కెట్‌లో నిషేధిత వస్తువుల అమ్మకాలు జరుగుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మాజీ  పోలీసు కమిషనర్‌ ఎస్‌.జార్జి, ఆహార భద్రత విభాగం, సేల్స్‌ ట్యాక్స్‌ విభాగం అధికారుల ఇళ్లతో కలిపి మొత్తం 32 చోట్ల సోదాలు చేసినట్లు తెలిపారు. 2016లో ఆదాయపన్ను అధికారులకు మాధవ రావ్‌ అనే వ్యాపారి కార్యాలయంలో ఆ డైరీ దొరికింది. అందులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు రూ.40కోట్ల దాకా లంచాలు ఇచ్చినట్లు ఉంది.
———————————
కృష్ణమ్మకు జలహారతి
– నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణమ్మకు జలహారతి
– భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు
– హారతి ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌
నాగార్జునసాగర్‌, సెప్టెంబర్‌5(ఆర్‌ఎన్‌ఎ) : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటిమట్టం రావడంతో పల్నాడు ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం రైతులతో కలిసి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడేలా చూడాలని కృష్ణమ్మను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలకు పూర్తిస్థాయిలో నీటిమట్టం రావడం చాలా సంతోషకరమన్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోవడం శుభపరిణామని తెలిపారు. ప్రకృతి కూడా కరుణించిందని, ఇక నుంచి రైతు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని ఎమ్మెల్యే యరపతినేని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, కేంద్ర సహకరించకపోయినా పట్టిసీమను పూర్తి చేసి గోదావరి జలాలను డెల్టా ప్రాంతాలకు తరలించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నారని  చెప్పుకొచ్చారు. రాజు పరిపాలన దక్షుడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే యరపతినేని పేర్కొన్నారు. ఎగువ కృష్ణా నుంచి వస్తున్న వరదతో నాగార్జుసాగర్‌కు పూర్తిస్థాయి నీటిమట్టం వచ్చి చేరింది.
నాలుగేళ్ల తర్వాత నాగార్జునసాగర్‌ నీటితో నిండుకుండలా మారింది. దీంతో కృష్ణా పరివాహక ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలో పల్నాడు ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకుని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. భవిష్యత్తులో కూడా నీరు పుష్కలంగా ఉండేలా చూడాలని రైతులు కోరుకున్నారు.
————————–