గుడుంబా నివారణకు పోరాటం..
వరంగల్ : పల్లె ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు గురిపెట్టారు. గ్రామాల నుంచి గుడుంబా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఊరూ వాడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తండాలను గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో గుడుంబా నివారణ కోసం సాగుతున్న పోరాటంపై ప్రత్యేక కథనం..
అనేక సదస్సులు..
ఒకప్పుడు వరంగల్ జిల్లాలో గుడుంబా గుప్పుమనేది. ప్రతి పల్లెలో గుడుంబా తయారీ, విక్రయాలు జోరుగా జరిగేవి. తండాలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ సబ్‌డివిజన్‌లో లంబాడీ తండాలు సారా మత్తులో జోగుతూ.. పచ్చని సంసారాలను నాశనం చేసుకున్నారు. కుటుంబానికి అండగా ఉండాల్సిన ఇంటి పెద్ద.. గుడుంబాకు బానిసై మృత్యువాత పడ్డారు. దీంతో అనేక తండాల్లోని మహిళలు వితంతువులుగా మారారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గుడుంబా తయారీ వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించేందుకు పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడతున్నారు. స్వచ్చంద సంఘాలు, యువజన, మహిళా సంఘాల సహకారంతో తండావాసుల్లో గుడుంబా నుంచి దూరంగా ఉండేందుకు అనేక సదస్సులు నిర్వహిస్తున్నారు.
గుడుంబారహితంగా మారిన 38 తండాలు…
తండాల్లోని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోంది. స్వచ్చంద సంస్థలు, యువజన, మహిళాసంఘాలతో కలిసి పోలీసులు నిర్వహించిన సదస్సులతో.. గుడుంబా వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలు ఆలోచించగలుగుతున్నారు. దీంతో మహబూబాబాద్ డివిజన్‌లోని 38 గ్రామాలు గుడుంబారహిత గ్రామాలుగా మారిపోయాయి. పోలీసుల నిరంతర పర్యవేక్షణతో.. అసలు ఆ తండాల్లో గుడుంబా వాసనలే లేకుండా పోయాయి. మరోపక్క ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి గుడుంబా తీసుకువచ్చి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనేక తండాల్లో గుడుంబా తయారీ, విక్రయాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మార్పుతో పోలీసుల్లో ఉత్సాహం పెరిగింది. గుడుంబారహిత గ్రామాల స్ఫూర్తితో మిగతా తండాల్లోనూ గుడుంబా తయారీ, విక్రయాలను నిలిపివేసేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్వచ్చంద సంస్థలు, యువజన, మహిళా సంఘాలతో అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. గుడుంబా వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి..
ఇప్పటికే గుడుంబాకు బానిసై రోడ్డున పడ్డామని అనేక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందితే గుడుంబాకు దూరంగా ఉంటామని వారు అంటున్నారు. గుడుంబా రక్కసి నుంచి తండావాసులను రక్షించేందుకు కంకణం కట్టుకున్న పోలీసులు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.