గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ తరగతులు

ఇంటర్‌ కాలేజీలుగా 33 గురుకులాలు అప్‌గ్రేడ్‌

వివరాలు వెల్లడించిన కడియం

వరంగల్‌,జూలై5(జ‌నం సాక్షి): విద్యాశాఖ పరిధిలో నడుస్తున్న 33 గురుకుల పాఠశాలలను ఇంటర్‌ కాలేజీలుగా ఈ ఏడాది అప్‌ గ్రేడ్‌ చేశారు. వీటిలో ఆ మేరకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ కొత్త కాలేజీల్లో ఇంటర్‌ తరగతులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విద్యాశాఖ పరిధిలో 35 గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే రెండింటిలో ఇంటర్‌ తరగతులు నడుస్తున్నాయని అన్నారు. విద్యాశాఖ గురుకుల పాఠశాలలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ మౌలిక వసతుల కోసం 116 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వల్ల కేబ్‌ చైర్మన్‌గా తాను కేజీబీవీలను 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలు అంగీకరించడం వల్లే దేశవ్యాప్తంగా కేజీబీవీలలో కూడా ఇంటర్‌ విద్య అందుబాటులోకి వస్తోందన్నారు. తెలంగాణలో ఈ సంవత్సరం 84 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు, 17 మోడల్‌ స్కూళ్లు, 24 గిరిజన గురుకులాలు, 19 బీసీ గురుకులాలు, 10 మైనారిటీ గురుకులాలను ఇంటర్‌ కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌ చేశామన్నారు. కేజీబీవీలలో ఇంటర్‌ తరగతులు జూలై 2వ తేదీ నుంచి ప్రారంభ మయ్యాయని చెప్పారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ గత పాలనలో భ్రస్టు పట్టిందని, దీనిని గాడిన పెట్టి ప్రమాణాలు పెంచాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంపీగా ఉన్న తనను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిని చేశారని చెప్పారు. గత నాలుగేళ్ల కృషిలో భాగంగా ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్‌ లో ప్రభుత్వ విద్యాలయాల్లో మంచి ఫలితాలు రావడం సంతోషంగా ఉందన్నారు. నేడు ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడిందన్నారు. విద్యాశాఖ గురుకులాల్లో ఇంటర్‌ లో 3000 సీట్లకు నోటిఫికేషన్‌ ఇస్తే 80వేల దరఖాస్తులు రావడం ఈ డిమాండ్‌ కు నిదర్శనమన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంలో భాగస్వామ్యం వహించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులం దరికీ ధన్యవాదాలు తెలిపారు. నేడు తెలంగాణ విద్య దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ త్వరలోనే విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు కూడా చేయించనున్నారని వెల్లడించారు. ఇకపోతే జనగామ జిల్లా కొడకండ్ల గురుకుల విద్యాలయంలో హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ ను విద్యార్థినిలకిచ్చి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అదేవిధంగా ఈ ఏడాది నుంచి పాఠశాలల అప్‌ గ్రేడ్‌ అయిన 33 విద్యాశాఖ గురుకులాల ఇంటర్‌ కాలేజీల తరగతులను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొడకండ్ల గురుకుల కాలేజీలో 2.50 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యార్థినిల డార్మిటరీ భవనాన్ని, సీసీ రోడ్లను ప్రారంభించి, 40 లక్షలరూపాయలతో నిర్మించనున్న కాలేజీ అదనపు తరగతి గదులకు కడియం శ్రీహరి బుధవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణలో చదువుకున్న విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడేవిధంగా ఉండాలన్న సిఎం కేసిఆర్‌ ఆదేశాల మేరకు నేడు తెలంగాణ విద్యను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ నాలుగేళ్లలోనే 573 గురుకుల పాఠశాలలు, 191 గురుకుల జూనియర్‌ కాలేజీలు, 53 డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీలు ప్రారంభించుకున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం వీటి నిర్వహణ కోసం ఏటా 3500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులపై ఒక్కొక్కరి విూద లక్ష రూపాయలకు పైగా వ్యయం చేస్తున్నామని చెప్పారు. గురుకుల విద్యాలయాల వ్యవస్థను ప్రారంభించిందే ఇక్కడి నుంచి అని తెలిపారు.