గేర్‌ రాడ్‌ స్థానంలో వెదురు కర్ర

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం
అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముంబయి,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): గేర్‌ రాడ్‌కు బదులుగా వెదురు కర్రను ఉపయోగించి ప్రమాద స్థితిలో పాఠశాల బస్సును నడిపిన డ్రైవర్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖర్‌ వెస్ట్‌ ప్రాంతంలో బస్సు డ్రైవర్‌ మంగళవారం  ఓ ఖరీదైన కారును ఢీకొట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మూడరోజులుగా అలాగేబస్సు నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడు. ప్రమాద సమయంలో బస్సులో స్కూలు పిల్లలు ఉన్నా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు నిందితుడిని రాజ్‌ కుమార్‌గా గుర్తించారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ బస్సును పక్కన ఆపించి, బస్సు డ్రైవర్‌ను ప్రశ్నిస్తోన్న సందర్భంలో గేర్‌ రాడ్‌ స్థానంలో వెదురు కర్రను గుర్తించాడు. దాంతో ఆగ్రహానికి గురైన కారు యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు బస్సును సీజ్‌ చేసి,  రాజ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. విరిగిపోయిన గేర్‌ రాడ్‌ను సరిచేయించడానికి సమయం లేకపోవడంతో గత మూడు రోజులుగా వెదురుకర్రతోనే గేర్లు వేస్తూ, బస్సు నడుపుతున్నానని విచారణ సందర్భంగా కుమార్‌ వెల్లడించాడు. ‘ఈ విషయం తెలిసిన వెంటనే చాలా విస్మయానికి గురయ్యాం. పాఠశాల విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారు. విచారణలో పూర్తిగా సహకరిస్తాం’ అని పాఠశాల యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.