గోదావరి వరద ఉధృతితో లంక గ్రామాల విలవిల

నీటిలోనే పలు గ్రామాలు

నీట మునిగిన పంట పొలాలు

రాకపోకలకు తీవ్ర అంతరాయం

కాకినాడ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమలో అనేక లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఎగువ నుంచి వరదనీరు ఉద్ధృతంగా సముద్రంలోకి విడిచిపెట్టడంతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పూరిళ్లువరదనీటిలో చిక్కుకున్నాయి. గోదావరి మ¬గ్రరూపం దాల్చటంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక భూముల్లో పంటలు వరద నీటిలో నానుతున్నాయి. గోదావరికి వరద వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా లంకభూములలో నీరు తగ్గకపోవటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వెదురుబీడిం, కె.ఏనుగుపల్లిలంక, జి.పెదపూడిలంక, శివాయలంక, అప్పనపల్లి ప్రాంతాల వద్ద కాజ్‌వేలు మునిగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. నివాసాలు ముంపు బారిన పడిన బాధితులు ఏటిగట్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లంక భూములలో పశుగ్రాసం, అరటితోటలు, కూరగాయల తోటలు, పాదులు ఎక్కువగా పండిస్తారు. గత ఏడెనిమిది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంతగా గోదావరికి వరదనీరు పోటెత్తటంతో పంటలు రోజుల తరబడి నీళ్లలో మునిగే ఉన్నాయి. పంటలు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నేలంక, కూనాలంక, చింతపల్లి లంక గ్రామాల్లోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వందలాది ఎకరాల పంట నీటమునిగింది. అధికారుల నిర్లక్ష్యం వలనే ఇలా జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ్మిలేరుకు గండి పడిందని, అధికారులు దాన్ని తాత్కాలికంగా పూడ్చారే తప్ప.. శాస్వత పరిష్కారం చేయలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నరాత్రి గండి పడడంవల్ల తామంతా పొలాలవద్దకు చేరుకుని పంటను కాపాడుకునే ప్రయత్నం చేశామని చెప్పారు. అయితే వరద ఉధృతి భారీగా రావడంతో తాము తమ పంటలను కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

——-

 

తాజావార్తలు