*గోమయ, మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని, పర్యావరణహిత గణపయ్యలనే పూజిద్దామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని క్లిమోమ్ ఆద్వర్యంలో తయారు చేసిన గోమయ వినాయక ప్రతిమలను సోమవారం శాస్త్రినగర్ లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి గోమయ గణపతి విగ్రహాలను పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్లిమోమ్ ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉచితంగా గోమయ వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తుందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో వీటిని అందజేస్తున్నామని తెలిపారు.
గోమయం, మట్టితో తయారు చేసిన విగ్రహాలతో ఎలాంటి హాని ఉండదని, కాలుష్యం లేని పర్యావరణ హితం కోరే ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలర్స్, ఇతర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా నీరు కలుషితమై జలచరాల ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
పర్యావరణానికి మేలు చేయాలంటే మట్టి, గోమయ గణపతి ప్రతిమల ను ప్రతిష్టించి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించాని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అల్లోల మరళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, క్లిమోమ్ వ్యవస్థాపకురాలు దివ్యారెడ్డి, గౌతం రెడ్డి, నిర్మల్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు మారుగొండ రాము, ఇతర స్థానిక ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
*మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రి అల్లోల*
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆద్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణేష్ ఉత్సవాల సందర్భంగా పీసీబీ ప్రతీ సంవత్సరం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1.40 లక్షల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నిర్మల్ జిల్లాలో 10 వేల విగ్రహాలను అందజేస్తున్నామని చెప్పారు.
