గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

పారికర్‌ అనారోగ్యంతో కాంగ్రెస్‌ అత్యుత్సాహం

గవర్నర్‌ మృదులా సిన్హాకు లేఖ

పనాజీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): గోవాలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని గోవా కాంగ్రెస్‌ గవర్నర్‌ను కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సోమవారం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది. అయితే ప్రస్తుతానికి గవర్నర్‌తో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల భేటీ జరగలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతకాలంగా గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తరచూ చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నారు. దీంతో రాష్ట్రంలో పాలన పడకేసిందంటూ కాంగ్రెస్‌ తరచూ ఆరోపిస్తున్నది. అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆదివారమే ప్రకటించిన ఆ పార్టీ.. సోమవారం గవర్నర్‌ మృదుల సిన్హాకు లేఖ రాసింది. లేదంటే బీజేపీ దొడ్డిదారిన రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం ఉన్నదని కూడా తాము గవర్నర్‌ను హెచ్చరించినట్లు కాంగ్రెస్‌ చెప్పింది. పారికర్‌ తాను లేకపోయినా.. కనీసం తన కేబినెట్‌ సహచరుడికి పాలన బాధ్యత అప్పగించక పోవడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిని బట్టే బీజేపీకి అధికారంపై ఎంత మోజు ఉందో అర్థమవుతున్నదని కాంగ్రెస్‌

విమర్శించింది. అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్‌పై తమకు కూడా సానుభూతి ఉన్నా.. తమ చేతుల్లోనే అధికారాన్ని లాక్కోవడం, గోవాలో కీలక అంశాలను సరిగా పట్టించుకోకపోవడం సరికాదని కాంగ్రెస్‌ అంటున్నది. గోవాలో అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు, ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని ఆ పార్టీ ఆరోపించింది. శనివారం మరోసారి పారికర్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఈ ఏడాది మొదట్లో అమెరికాలో చికిత్స తీసుకున్నా.. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అనారోగ్యంతో ఏదో ఒక ఆసుపత్రిలో చేరుతూనే ఉన్నారు.