చంద్రమండల యాత్ర గుట్టును విప్పుతాం

అమెరికా కాలుమోపిందీ లేనిదీ తేలుస్తాం

రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటన

మాస్కో,నవంబర్‌24(జ‌నంసాక్షి): చంద్రుడిపై కాలుపోపామని అమెరికా ప్రకటించి దశాబ్దాలు దాటినా దానిపై వివారాదాలు తొలగడం లేదు. ఒకవేళ కాలుమోపితే ఆ తరవాత అక్కడికి ఎందుకు వెళ్లలేక పోయారన్న అనుమానాలు ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. దీంతో ఈ గుట్టును రట్టు చేస్తామని ఇప్పుడు రష్యాప్రకటించింది.

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై కాలుమోపాడని అమెరికా ప్రకటించినప్పటి నుంచీ ఈ ప్రశ్న వినవస్తూనే ఉంది. కాకపోతే ఆ సంగతి అటోఇటో తేలుస్తామని రష్యా ప్రకటించింది. తేల్చుకుంటామని రష్యా అంటున్నది. తాము త్వరలో చేపట్టనున్న చంద్రమండల యాత్రలో అమెరికా తన అంతరిక్షనౌక దిగిందని చెప్పిన చోటికి వెళ్లి ఆ జెండా అవీ ఉన్నాయో లేవో చూస్తామని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్‌ అధిపతి డిమిట్రీ రొగోజిన్‌ చెప్పారు. శనివారం జరిగిన పత్రికా సమావేశంలో ఆయన ఈ సంగతి వెల్లడించారు. కాకపోతే నర్మగర్భితంగా నవ్వేశారు. అమెరికా 50 ఏళ్ల క్రితం చంద్రమండలంపైకి నాసా అంతిరక్షనౌకలో ముగ్గురు వ్యోమగాములను పంపిన మాట వాస్తవమా, కాదా? అని ఓ విలేకరి అడిగినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. అమెరికా వ్యోమగాములు అసలు చంద్రునిపై కాలుమోపనే లేదని, నెవాడా ఎడారిలో సెట్టింగ్‌ వేసి ఫొటోలు తీసి ప్రపంచానికి చూపెట్టారని ఓ కథనం ప్రచారంలో ఉంది. అప్పట్లో రష్యా కూడా మూడుసార్లు రాకెట్లు పంపేందుకు జరిపిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సహజంగానే అమెరికా కథనాలపై రష్యాలో జోకులు విరివిగా వినిపించేవి. ఆ మాటకు వస్తే అమెరికాలోనూ ఇలాంటివి దండిగానే ప్రచారంలో ఉన్నాయి. కాకపోతే తాజాగా రష్యా మరోసారి చంద్రయాత్ర చేపట్టింది. అందులో భాగంగా నిజంగానే అమెరికా కథనాన్ని ధ్రువీకరించుకుంటుందా? లేక రోస్‌కాస్మోస్‌ అధిపతి సరదాగా అలా అన్నారా? అనేది మిలియన్‌ రూబుల్‌ ప్రశ్న.