చక్కెర సబ్సిడీ ఎత్తివేత పేదలకు భారం

ఆందోళనలో వినియోగదారులు 
వరంగల్‌,మే14(జ‌నం సాక్షి): ఇటీవల దేశవ్యాప్తంగా చక్కెర, కిరోసిన్‌ పంపిణీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం వివరాలు సేకరించింది. శాఖాపరంగా జరిపిన సర్వే ప్రకారంగానే చక్కెర, కిరోసిన్‌ కోటాలు.. పేదలకు అందకుండా పక్కదారి పడుతున్నాయని నివేదికలు అందాయి. చక్కెర బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతుందని గుర్తించారు. కిరోసిన్‌ పేదలకు కొంతమేర ఉపయోగపడుతుందని అధికారులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగానే చక్కెరపై సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్టాల్రకు ఎలాంటి సమాచారం లేకుండా రాయితీని ఎత్తివేయటంతో చక్కెర సరఫరా అవుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు మాత్రం మూసేసినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఇక కిరోసిన్‌ను వెంటనే ఎత్తివేయకుండా కోటాలో కోత పెట్టి కొన్నాళ్లు నడిపించాలని నిర్ణయించినట్లు సమాచారం.
తాజా ఉత్తర్వుల ప్రకారం కిరోసిన్‌ కోటాను మున్సిపల్‌ కార్పొరేషన్‌, దాని పరిధిలోని గ్యాస్‌ కనెక్షన్‌ లేనివారికి 2 లీటర్లు, గ్రావిూణులు, దీపం కనెక్షన్‌ ఉన్న వారికి లీటరు చొప్పున ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. కేంద్రం కిరోసిన్‌ కోటా తగ్గించినందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చౌక ధరల దుకాణాల ద్వారా గతంతో తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేవారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ప్రభుత్వంలోనే చాలా వాటికి మంగళం పాడారు. ఆ తరువాత పామాయిల్‌పై సబ్సిడీ ఎత్తివేయటంతో దాన్ని తీసేశారు. ఇక మిగిలింది చక్కెర, బియ్యం, కిరోసిన్‌ మాత్రమే.. ఏప్రిల్‌లోనే పంచదార కోటా పూర్తిగా ఎత్తేశారు. కిరోసిన్‌ కోటాను తగ్గించారు. దీంతో ఇక  పూర్తిస్థాయిలో విడుదల చేస్తుంది ఒక్క బియ్యం మాత్రమే. కేంద్రం సబ్సిడీ ఎత్తివేసిందని చక్కెర పంపిణీ బంద్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన పౌర సరఫరాల శాఖ ఎండీ సీవీ ఆనంద్‌.. తాజాగా కేంద్రం కిరోసిన్‌ కోటాను తగ్గించిందని చెబుతూ పేదలకు ఇస్తున్న కోటా తగ్గిస్తూ జీఓ విడుదల చేశారు. ఒకవైపు పెరుగుతున్న ధరలు.. మరోవైపు నిత్యావసరాల సరకులు ఒక్కొక్కటిగా మాయమవుతుండటంతో నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. గతంలో కార్పొరేషన్‌ పరిధిలోని లబ్దిదారులకు నాలుగు లీటర్ల కిరోసిన్‌ ఇచ్చేవారు. ఆ కోటాను కాస్తా 2 లీటర్లకు కుదించారు. ఇక పురపాలికల్లోని లబ్దిదారులకు గతంలో ఇచ్చే 2 లీటర్ల కిరోసిన్‌ను యథాతథంగా ఇస్తున్నారు. ఇక గ్రావిూణులకు గతంలో రెండు లీటర్లు ఇచ్చేవారు.. ప్రస్తుతం దాన్ని లీటరుకు తగ్గించారు. ఇక దీపం కనెక్షన్‌దారులకు గతంలో లీటరు పంపిణీ చేసేవారు.. దాన్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.