చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

-14మంది నక్సల్స్‌ హతం
ఛత్తీస్‌గఢ్‌, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి భారీఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుంట సవిూపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 14మందిపైగా నక్సల్స్‌ హతమయ్యారు. సుక్మా జిల్లా కుంట పోలీసు స్టేషన్‌ పరిధి కన్నాయిగూడ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 14మంది మావోయిస్టులు మృతి చెందారు.  16 తుపాకులు, నాలుగు ఐఈడీలు, 5కిట్‌ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో నక్సల్స్‌ నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గొల్లపల్లి ప్రాంతంలో నక్సల్స్‌ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నక్సల్స్‌ కోసం ఇంకా కూంబింగ్‌ కొనసాగుతోందని కుంట ఎస్పీ ప్రకటించారు. కొద్దిరోజుల నుంచి పరిస్థితులు సాధారణంగానే కనిపించినా మళ్లీ తాజాగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జులై 20 బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన భారీ
ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఇటీవల మావోయిస్టులు వరుస దుశ్చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అదను చూసి భద్రతాబలగాలు దెబ్బతీశాయి. గత నెలలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలకు నక్సల్స్‌ పిలుపునివ్వడంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర¬ం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం గొల్లపల్లి ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.