చమురు దిగుమతికి తొలగిన అడ్డంకులు
ఆంక్షలను పక్కకు పెట్టిన అమెరికా
వాషింగ్టన్,నవంబర్2(జనంసాక్షి): ఇరాన్ నుంచి ముడి చమురు కొనేందుకు ఇండియా, సౌత్ కొరియా, జపాన్ సహా 8 దేశాలకు అమెరికా అనుమతిచ్చింది. వచ్చే వారం నుంచి ఇరాన్‌పై అమెరికా మరోసారి ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి పూర్తిగా ఆయిల్ దిగుమతులను నిలిపేయాలని అన్ని మిత్ర దేశాలను గతంలో అమెరికా ఆదేశించింది. దీంతో ఓ రకంగా ఇండియాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే తమకు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ దేశాలు కోరుతున్నాయి. ఇండియాతోపాటు జపాన్, సౌత్ కొరియా తమ చమురు దిగుమతుల కోసం ఎక్కువగా ఇరాన్‌పైనే ఆధారపడతాయి. ఇలా అమెరికా తీసుకున్న నిర్ణయం ఈ దేశాలకు పెద్ద ఊరట కలిగించే విషయమే. ఇక ఈ ఆంక్షల నుంచి తప్పించుకున్న దేశాల పూర్తి జాబితాను అధికారికంగా సోమవారం విడుదల చేయనున్నారు. ఇప్పటికీ అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, రెండో రోజుల్లో తుది నిర్ణయం వెలువడుతుందని చైనాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇండియా, సౌత్ కొరియాలాగే చైనా కూడా ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఊరట తాత్కాలికంగా మాత్రమే ఉండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. అమెరికా విధించిన ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ ముడి చమురు ఎగుమతులు భారీగా తగ్గిపోనున్నాయని గోల్డ్‌మాన్ సచ్స్ వెల్లడించింది. ఈ ఏడాది మధ్యలో రోజుకు 25 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తున్న ఇరాన్.. ఏడాది చివరినాటికి 15 లక్షల బ్యారెళ్లను మాత్రమే చేయొచ్చని ఈ సంస్థ తెలిపింది.