చర్చలకు భారతే అడ్డంకి
– శాంతిపూర్వక చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమే
– సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నుంచి సుష్మా వెల్లడం సరికాదు
– పాకిస్థాన్ మంత్రి షా ఖురేషి
న్యూయార్క్, సెప్టెంబర్28(జనంసాక్షి ) : భారత్- పాక్ దేశాల మధ్య శాంతిచర్చలకు భారతే అడ్డంకిగా మారిందని పాకిస్థాన్ మంత్రి షా ఖురేషీ ఆరోపించారు. సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నుంచి భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ వెళ్లిపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శాంతిపూర్వక చర్చలకు భారత్‌తే అడ్డుగోడగా నిలుస్తోందని ఆయన వ్యాఖ్యలు చేశారు. నేపాల్ విదేశాంగ మంత్రి ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుష్మా మాట్లాడిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారని,
‘సమావేశంలో ఆమె మాట్లాడిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. నేను ఆమెతో ఏవిూ మాట్లాడలేదని తెలిపారు. విూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోవడం పట్ల సానుకూలంగానే స్పందిస్తున్నాను. బహుశా ఆమెకు ఇక్కడ బాగున్నట్లుగా లేదనుకుంటా అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఓ దేశం వైఖరి కారణంగా సార్క్ దేశాల సమావేశ లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందంటూ భారత్‌పై పరోక్షంగా ఖురేషీ విమర్శలు చేశారు. ప్రాంతీయ సహకారం గురించి ఆమె మాట్లాడారు. ఇతర దేశాల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకోకుండా, చర్చలు జరపకుండా ప్రాంతీయ సహకారం అసలు ఎలా ఏర్పడుతుందని నేను ప్రశ్నిస్తున్నానని అన్నారు. చర్చలకు విూరే అడ్డుగోడలాగా ఉంటున్నారంటూ ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్క్ దేశాల సమావేశం నుంచి సుష్మా వెళ్లిపోవడంపై భారత వర్గాలు స్పందించాయి. ఇతర సమావేశాలు ఉండటం మూలానే ఆమె మధ్యలోనే వెళ్లిపోయారని తెలిపాయి. సుష్మాకు బదులుగా సమావేశాల్లో విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే కొనసాగారని తెలిపాయి. అయితే.. సుష్మా వెళ్లిపోవడానికి ముందే అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మంత్రులు కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. రెండేళ్లకు ఒకసారి జరిగే సార్క్ సమావేశాల్లో అందులో సభ్యులుగా ఉన్న దేశాలు పాల్గొంటాయి. 2016లో జరగాల్సిన సమావేశాన్ని భారత్ బహిష్కరించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు, ఉగ్రవాదులకు పాక్ అండగా ఉంటుందని, అందుకే ఈ సమావేశాలో పాల్గొనబోమని స్పష్టం చేసింది. భారత్ నిర్ణయంతో భూటాన్, బంగ్లాదేశ్, అఫ్గాన్ దేశాలు ఏకీభవించి సదస్సుకు హాజరుకాలేదు.