చర్చలు సందిగ్ధం


` ఎటూ తేలని ఫలితం
` మరో విడత సమావేశమయ్యే అవకాశం
` ఐరోపా సమాఖ్యలో తక్షణమే సభ్యత్వం కల్పించండి
` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఈయూకు విజ్ఞప్తి
` సభ్యత్వానికి సంబంధించిన దరఖాస్తుపై జెలెన్‌స్కీ సంతకం
` ఇదో చారిత్రక క్షణమని పేర్కొంటూ ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ ట్వీట్‌
` కీవ్‌ నగరంలో వీకెండ్‌ కర్ఫ్యూ ఎత్తివేత
బెలారస్‌,ఫిబ్రవరి 28(జనంసాక్షి):ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉక్రెయిన్‌` రష్యాల మధ్య శాంతి చర్చలు ముగిశాయి. బెలారస్‌ సరిహద్దులోని గోమెల్‌ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సుమారు నాలుగు గంటలపాటు చర్చలు కొనసాగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేయాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేసినట్లు సమాచారం. క్రిమియా, డాన్‌బాస్‌ నుంచి రష్యా సైన్యం వైదొలగాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తమ డిమాండ్ల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా కోరుతోంది.చర్చల్లో రెండు దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. ఇరు వర్గాలు తమ వైఖరికే కట్టుబడినట్లు కనిపిస్తున్నది.అమెరికా సారధ్యంలోని నాటో కూటమిలో చేరబోమని ఉక్రెయిన్‌ లిఖిత పూర్వకంగా రాసివ్వాలని రష్యా డిమాండ్‌ చేసింది. అలా లిఖిత పూర్వకంగా హావిూ ఇస్తే, సైన్యాన్ని ఉప సంహరిస్తామని చెప్పినట్లు సమాచారం. కానీ నాటో కూటమిలో చేరే విషయమై ఉక్రెయిన్‌ వెనక్కు తగ్గినట్లు కనిపించడం లేదు.తక్షణం యుద్ధాన్ని విరమించాలని రష్యాను ఉక్రెయిన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.అంతే కాదు సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేసింది. క్రిమియా నుంచి కూడా సైనిక బలగాలను ఉపసంహరించాలని పట్టుబట్టింది. నాటో కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సిద్ధ పడటం వల్లే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆగ్రహించారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగారు.లొంగిపోయే ప్రసక్తే లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు. చర్చల్లో ఐదుగురు రష్యా, ఆరుగురు ఉక్రెయిన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎటువంటి తీర్మానం చేయకుండా శాంతి చర్చలు ముగిశాయి.
మరో విడత జరగనున్న చర్చలు!
రష్యా` ఉక్రెయిన్‌ మధ్య తొలి విడత చర్చలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే, ఇరు దేశాల ప్రతినిధులు మరోసారి భేటీ అయి చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. పోలిష్‌`బెలారసియన్‌ సరిహద్దులో తదుపరి చర్చలు జరపనున్నట్టు రష్యా ప్రతినిధి బృందానికి సారథ్యం వహిస్తున్న నేత చెప్పినట్టు ‘స్పుత్నిక్‌’ వార్తా సంస్థ వెల్లడిరచింది. ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు రెండో దఫా చర్చలకు ముందు సంప్రదింపులు జరుపుకొనేందుకు మాస్కో, కీవ్‌కు చేరుకున్నట్టు పేర్కొంది.
ఇరువైపులా ప్రాణనష్టం సంభవిస్తోంది
రష్యా దాడిలో ఇప్పటివరకు తమవైపు 16మంది చిన్నారులతో పాటు 352 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఐరాస సాధారణ సభ అత్యవసర సమావేశంలో ఉక్రెయిన్‌ ప్రతినిధి వెల్లడిరచారు. ఈ సంఖ్య ఇంకా నాన్‌స్టాప్‌గా పెరుగుతూనే ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా సేనల్లో కూడా వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందన్నారు. తమ దేశంపై దాడిని ఆపాలనీ.. భేషరతుగా రష్యా బలగాల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించాలని కోరుతున్నామన్నారు. కాగా యూరోపియన్‌ యూనియన్‌లో సభ్యత్వానికి సంబంధించిన అప్లికేషన్‌పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేశారు. ఇదో చారిత్రక క్షణమని పేర్కొంటూ ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ ట్వీట్‌ చేసింది. అంతకుముందు తమకు ఐరోపా సమాఖ్యలో తక్షణమే సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఈయూకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక విధానం ద్వారా అది సాధ్యమేనన్నారు. మరోవైపు ఆయుధాలను వీడి వెనక్కి వెళ్లిపోవాలని.. తద్వారా రష్యా సైనికులు తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య సైనిక చర్చలు ప్రారంభమయ్యే ముందు జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.కాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడినట్లు నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ వెల్లడిరచారు. ఆ దేశానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. నాటో దేశాలు ఉక్రెయిన్‌కు క్షిపణులు, ఆయుధాలు సమకూరుస్తున్నాయన్నారు.
కీవ్‌ నగరంలో వీకెండ్‌ కర్ఫ్యూ ఎత్తివేత
ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంలో వీకెండ్‌ కర్ఫ్యూ ఎత్తివేసినట్లు ఇండియన్‌ ఎంబసీ ట్వీట్‌ చేసింది. అంతే కాకుండా భారతీయ విద్యార్థులు పశ్చిమ ప్రాంతాల వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నది. స్వదేశానికి వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు.. ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకుని పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. హంగేరి, పోలాండ్‌, రోమానియా దేశాల నుంచి విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు విమానాల్లో విద్యార్థులను తరలించారు. ఇంకా ఉక్రెయిన్‌లో 16 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.క్రెయిన్‌పై రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారతీయ విద్యార్థులను తరలించే అంశంపై ప్రధాని నరేంద్ర మో చర్చించారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కొందరు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు విజిట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు హరిదీప్‌ సింగ్‌ పురి, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్‌ రిజిజు, వీకే సింగ్‌లు.. భారతీయ విద్యార్థులను తీసుకువచ్చేందుకు విదేశాలకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..భారతీయ విద్యార్థుల కోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులను తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్తున్నారని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌తో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితిలో అక్కడున్న భారత విద్యార్ధులు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఉక్రెయిన్‌ నుంచి తమను స్వస్ధలాలకు పంపాలని దేశ రాజధాని కీవ్‌లో చిక్కుకున్న విద్యార్ధిని భారత రాయబార కార్యాలయానికి పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని వాపోయారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ మోదీ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ విద్యార్ధులను ఇతర దేశాలు సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలించగా భారత ప్రభుత్వం మాత్రం ఈ దిశగా చేసింది శూన్యమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో 15,000 మందికి పైగా భారత విద్యార్ధులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని వరుణ్‌ గాంధీ అన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో భారత పౌరులకు సాయం చేయడం మోదీ ప్రభుత్వ కనీస బాధ్యతని ఆయన హితవు పలికారు. ఇక పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్లాలని భారత రాయబార కార్యాలయం చేస్తున్న సూచనలను ఉక్రెయిన్‌లో చిక్కుకున్న బాధిత విద్యార్ధిని ప్రస్తావిస్తూ సరిహద్దులకు తాము 800 కిలోవిూటర్ల దూరంలో ఉన్నామని, అధికారుల సాయం లేకుండా అంతదూరం ప్రయాణించడం కష్టసాధ్యమని బాధిత విద్యార్ధిని పేర్కొన్నారు. తాము భారత రాయబార కార్యాలయ సిబ్బందికి ఫోన్లు చేసినా ఆయన తమ కాల్స్‌ను తిరస్కరిస్తున్నారని తన లాగే ఇక్కడ పలువురు భారత విద్యార్ధినీ, విద్యార్ధులు చిక్కుకుపోయారని ఆమె పేర్కొన్నారు. కీవ్‌లో ఉన్నవారంతా రైళ్లలో బయటపడాలని ఈ మద్యాహ్నం ఎంబసీ అధికారులు సూచించారని తమకు సరైన మార్గదర్శకాలు అందించాల్సిన అధికారులు తమను పూర్తిగా విస్మరిస్తున్నారని విద్యార్ధిని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల నుంచి భారత విద్యార్ధులను బయటకు తరలిస్తున్నామని రాయబార కార్యాలయ సిబ్బంది చెబుతున్నారని..అయితే తామున్న ప్రాంతం నుంచి సరిహద్దు 800 కిలోవిూటర్ల దూరంలో ఉందని..విద్యార్ధులుగా తాము సరిహద్దులకు ఎలా వెళ్లగలుగుతామని ప్రవ్నించారు. భారత ప్రభుత్వం తమకు ఎంతమాత్రం సహకరించడం లేదని ఆమె ఆరోపించారు.