చికిత్స నిమిత్తం..  ఢిల్లీ ఎయిమ్స్‌కు పారికర్‌


– ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ ఎయిమ్స్‌కు
– బాధ్యతల నుంచి తప్పించాలని అమిత్‌షాకు వినతి
– రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌
పనాజీ, సెప్టెంబర్‌15(ఆర్‌ఎన్‌ఎ) : అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ మెరుగైన వైద్యం కోసం శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి వచ్చారు. శనివారం ఉదయం పారికర్‌ ప్రత్యేక విమానంలో పారికర్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.  కాగా ఈ ప్రత్యేక విమానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. పారికర్‌ ఆరోగ్య సమస్యల దృష్ట్యా తరచూ ఆయన విధులకు సెలవు పెట్టాల్సి వస్తోంది. దీంతో పాలనా వ్యవస్థ దెబ్బతింటోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. వెంటనే గోవాలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు సీఎం బాధ్యతల నుంచి పారికర్‌ కూడా తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించినట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం తాను సీఎంగా కొనసాగలేనని పారికర్‌ ఇప్పటికే మోదీ, అమిత్‌షాలను చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చడం కాస్త కష్టమని, అందుకే తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు సీఎంగా కొనసాగాలని పారికర్‌కు అమిత్‌షా సూచించినట్లు తెలుస్తోంది. ప్యాంక్రియాటిక్‌ సమస్యతో బాధపడుతున్న పారికర్‌ శుక్రవారం వరకు గోవాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. గతంలో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలోనూ చికిత్స తీసుకున్న ఆయన.. అమెరికాకు కూడా వెళ్లి మూడు నెలలపాటు వైద్య సేవలు పొందారు. కాగా ప్రస్తుతం పారికర్‌ సీఎం పదవి నుంచి తప్పుకోనుండటంతో తదుపురి సీఎంగా రాష్ట్ర బీజేపీ నేతల్లో ఎవరికి అవకాశం వస్తుందోనని గోవా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.