చురకుగా మిషన్ కాకతీయ పనులు
వరంగల్,మార్చి30(జనంసాక్షి):
డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, కలెక్టర్ వాకాటి కరుణల ఆదేశాలు పర్యవేక్షణలతో జిల్లాలో మిషన్ కాకతీయ పనులు చురుకుగా సాగుతున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో అధికారులు చురుకుగా పాల్గొంటున్నారు. పూడిక మట్టిని రైతులు ట్రాక్టర్లతో పొలాలు, చెలకల్లో పోసుకోవడం వంటి పనుఉల పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ మట్టిని ఉపయోగించుకుంటే పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. రసాయన ఎరువులను వినియోగించే ఖర్చు తగ్గుతుందని వ్యవసాయా అధికారులు అన్నారు. రాష్ట్రంలో 40,672 చెరువులు ఉన్నాయని, వాటిని క్రమేణా అభివృద్ధి చేసి 15 నుంచి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పథకంలో భాగంగా చెరువుల నుంచి పూడిక తీసిన మట్టిని రైతులు సద్వినియోగం చేసుకొంటే నేలలు సారవంతం అవుతాయని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఆయన కూడా తన నిచయోజకవర్గంలో చెరువుల పూడికతీత పనుల్లో చురుకుగా పాల్గొన్నారు. పూడిక తీయడం, తూములు, మత్తడి, పంట కాలువలు, కల్వర్టు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. చెరువు విస్తీర్ణం కోసం సరిహద్దులు నిర్ణయించడానికి వెంటనే సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులను నింపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే డా.రాజయ్య అన్నారు. విూదికొండ వత్సరాయణ చెరువు అభివృద్ధి పనులను
ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించారు. గత ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి సాగునీరు అందివ్వలేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో దేవాదుల పథకం కింద నిర్మించిన ఆరు రిజర్వాయర్లు, వాటి పరిధిలో కాలువలు తవ్వి గోదావరి జలాలతో చెరువులను నింపాలని గతంలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.