చెక్కులు,పాస్‌ పుస్తకాల పంపిణీకి షెడ్యూల్‌

కలెక్టర్‌ సూచనలతో పక్కాగా ఏర్పాట్లు
వరంగల్‌,మే3(జ‌నం సాక్షి):  రైతుబంధు పథకం కింద చెక్కులతో పాటు 10వ తేదీ నుంచి పాస్‌ పుస్తకాలను పంపిణీ చేసేందుకు షెడ్యూల్‌ రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం రెవెన్యూ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పాస్‌ పుస్తకాలను అందజేయనున్నారు. వీటిని ఇప్పటికే ఆయా మండలాలకు పంపి పూర్తి స్థాయిలో పరిశీలించారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకవస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తుంది. వారికి పెట్టుబడి విషయంలో ఎదురవుతున్న కష్టాలను తీర్చాలనే ఉద్ధేశ్యంతో దేశంలోనే తొలిసారిగా పంట పెట్టుబడి సాయం అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకుగాను రైతుబంధు పథకం రూపొందించి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8వేలు అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా జిల్లాలో సుమారు 78 వేల మందికిగాను రూ.69 కోట్ల చెక్కులు అందజేయనున్నారు. చెక్కులతోపాటు భూప్రక్షాళన అనంతరం రైతుకు కొత్తగా డిజిటలైజ్డ్‌ పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందిచేందుకు నిర్ణయించారు. ఈరెండు ఒకేరోజు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. మే 10వ తేదీ నుంచి 17 వరకు చెక్కులు, పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. కలెక్టర్‌ ఆమ్రపాలి, జేసీ దయానంద్‌ రెవెన్యూ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులతో పలు విడతలుగా సమావేశం ఏర్పాటు చేసి, వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ పకడ్బందీగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు
తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే చెక్కుల పంపిణీ విషయంలో బ్యాంక్‌ అధికారులతో సవిూక్షించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రైతులకు ప్రభుత్వం అందజేయనున్న చెక్కుల వివరాలను లీడ్‌ బ్యాంకు ద్వారా ఆయా బ్యాంకుల పంపించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది.
బ్యాంకుల వద్ద రైతులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఆయా బ్యాంకుల్లో సరిపడా డబ్బులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు.